Melbourne: ఆస్ట్రేలియాలో ఇస్కాన్‌ మందిరంపై ఖలిస్థానీ రాతలు..!

ఆస్ట్రేలియాలో మెలబోర్న్‌లో ఉన్న ఇస్కాన్‌ మందిరంపై ఖలిస్థానీ మద్దతుదారలు భారత వ్యతిరేక వ్యాఖ్యలు రాశారు. 

Updated : 23 Jan 2023 13:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా(Australia)లోని మరో ఇస్కాన్‌ మందిరంపై తాజాగా ఖలిస్థానీ మద్దతు నినాదాలు ప్రత్యక్షమయ్యాయి. నెల రోజుల వ్యవధిలో అక్కడి హిందూ దేవాలయాలపై ఇటువంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ‘ఆస్ట్రేలియా టుడే’ పత్రిక కథనం ప్రకారం.. మెల్‌బోర్న్‌(Melbourne )లోని ఆల్బెర్ట్‌ పార్క్‌లోని ఇస్కాన్‌ ఆలయంపై కొందరు ‘ఖలిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ భారత విద్వేష నినాదాలు రాశారు. దీంతో పాటు ఖలిస్థాన్‌ ఉగ్రవాది బింద్రావాలాను పొగుడుతూ రాతలు రాశారు. ఇటీవలి కాలంలో కర్రమ్‌ డౌన్స్‌లోని ‘శ్రీ శివ విష్ణు’ మందిరం, మిల్‌ పార్క్‌లోని స్వామి నారాయణ్‌ మందిరంపై ఖలిస్థానీ మద్దతుదారులు ఇలానే రాశారు. కొన్నాళ్ల క్రితమే విక్టోరియాలోని మందిరంపై కూడా ఇటువంటివి కనిపించాయి.

ఈ ఘటనలపై భారత్‌(India )లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని వెల్లడించారు. ‘ఆస్ట్రేలియా విభిన్న సంస్కృతుల సమ్మేళనం అని చెప్పేందుకు గర్వపడుతున్నామని’ ఆయన పేర్కొన్నారు. తాము వాక్‌ స్వాతంత్ర్యానికి మద్దతు ఇస్తామని.. అంతేగానీ విద్వేషపూరిత భాషకు, హింసకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. మరో వైపు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ మాట్లాడుతూ ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మెల్‌బోర్న్‌లోని భారత కాన్సూలేట్‌ జనరల్‌ ఆస్ట్రేలియా పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని