Pakistan: పాకిస్థాన్‌ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. ఖురేషీ విడుదలకు ఆదేశాలు..!

పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తత రాజుకొంటోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. మరోవైపు పీటీఐ నేత ఖురేషీ అరెస్టు విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. 

Updated : 18 May 2023 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అణచివేత విషయంలో పాకిస్థాన్‌ ప్రభుత్వానికి, సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. శాంతి భద్రతలను సాకుగా చూపుతూ గత వారం పీటీఐ నాయకుడు షా మహమూద్‌ ఖురేషీని అరెస్టు చేయడం చట్టవ్యతిరేమని ఇస్లామాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఖురేషీ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ మియాంగుల్‌ హసన్‌ ఔరంగజేబ్‌ విచారించి ఈ మేరకు తీర్పును వెలువరించారు. వెంటనే ఖురేషీని విడుదల చేయాలని ఆదేశించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖురేషీ అరెస్టు జరిగింది. 

మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంట్లో 40 మంది వరకు ఉగ్రవాదులున్నారని.. వారిని అప్పగించాలంటూ ప్రభుత్వం 24 గంటల గడువు ఇచ్చింది. తాజాగా ఆ సమయం ముగియడంతో లాహోర్‌లోని ఆయన ఇంటిని భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఆ మార్గం మొత్తాన్ని బారికేడ్లతో మూసివేశారు. మరోవైపు అల-ఖాద్రీ ట్రస్ట్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి నేడు ఇమ్రాన్‌కు నేషనల్‌ అకౌంట్‌బిలిటీ బ్యూరో నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఎన్‌బీఏకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పలు కేసుల విచారణలు ఉండటంతో ఎన్‌బీఏ ఎదుట హాజరుకావడం సాధ్యంకాలేదని పేర్కొన్నారు. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని ఖండించారు.  

మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేపట్టారు. నిరాయుధులైన పీటీఐ కార్యకర్తలపై మే9వ తేదీన కాల్పులు జరిపిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఖాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ కాల్పుల్లో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో గాయపడ్డారని ఆయన చెప్పారు.

పాక్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ 65 మంది అమెరికా కాంగ్రెస్‌ ఎంపీలు విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ఓ లేఖను రాశారు. పాక్‌లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, కాపాడటానికి కృషి చేయాలని కోరారు. ఇందు కోసం అందుబాటులో ఉన్న మార్గాలన్నీ ఉపయోగించుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని