Team Jorge: 30కిపైగా దేశాల్లో అసత్య ప్రచారాలు.. సంచలనం రేపుతోన్న ఇజ్రాయెల్‌ బృందం సాఫ్ట్‌వేర్‌..?

ప్రపంచ వ్యాప్తంగా ఫేక్‌ న్యూస్‌ (Fake News) వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో (Social Media) ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్‌ (Israel) బృందం ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని వెలుగులోకి వచ్చింది. భారత్‌లో ఎన్నికల సమయంలోనూ దీనిని ఉపయోగించినట్లు జర్నలిస్టుల కన్సార్టియం జరిపిన పరిశోధనలో వెల్లడైంది.

Published : 17 Feb 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా అసత్య వార్తల (Fake News) ప్రచారంపై తీవ్ర చర్చ నడుస్తోన్న సమయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బృందం (Israel) ప్రపంచ వ్యాప్తంగా 30కిపైగా దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే విషయం సంచలనం రేపుతోంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కోసం ఈ బృందం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్‌ జార్జ్‌ (Team Jorge) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ బృందం.. భారత్‌లోనూ తప్పుడు ప్రచారం చేసినట్లు ది గార్డియన్‌ పత్రికకు చెందిన వారితో సహా అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం జరిపిన సీక్రెట్‌ ఆపరేషన్‌ వెల్లడించింది.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌..

ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారాన్ని చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బృందం ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం అడ్వాన్స్‌డ్‌ ఇంపాక్ట్‌ మీడియా సొల్యూషన్స్‌ (AIMS) పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీని రూపొందించిందట. ఇప్పటికే దాదాపు 30కిపైగా దేశాల్లోని క్లయింట్లకు అందించిందని సమాచారం. వాటిలో 27 దేశాల్లో వారు విజయవంతమైనట్లు సదరు బృందం చెప్పుకుంటోంది.

జర్నలిస్టుల కన్సార్టియం ఆపరేషన్‌..

తాల్‌ హానన్‌ (50) అనే ఇజ్రాయెల్‌ మాజీ సైనికుడు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నాడు. జార్జ్‌ పేరుతో ప్రైవేటుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ‘టీమ్‌ జార్జ్‌’ (Team Jorge)గా పిలుస్తున్నారు. హ్యాకింగ్‌, దౌర్జన్యం, ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారాలే వీళ్ల ప్రధాన కార్యకలాపాలు. వీటిని నిగ్గుతేల్చేందుకు క్లయింటు పేరుతోనే జర్నలిస్టుల బృందం ఆయన్ను సంప్రదించింది. వారితో ముచ్చటించిన హానన్‌.. ఆ సాఫ్ట్‌వేర్‌ పనితీరును వివరించాడు. కొన్ని టెలిగ్రాం అకౌంట్లను ప్రత్యక్షంగా హ్యాక్‌ చేసి చూపిండంతోపాటు సోషల్‌ మీడియాలో ప్రచారాలతో ఎన్నికలను ఎలా ప్రభావితం చేయవచ్చో వివరించి చూపాడు. తర్వాత దీనిపై జర్నలిస్టులు హానన్‌ను ప్రశ్నించగా.. తాను ఏ తప్పూ చేయడంలేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పాడట.

గౌరీ లంకేష్‌ స్ఫూర్తితో..

సోషల్‌ మీడియాలో సాగుతోన్న అసత్య వార్తల ప్రచారంపై అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం దృష్టి సారించింది.  ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు. వీరిని ఫ్రాన్స్‌కు చెందిన ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ సమన్వయపరిచింది. జర్నలిస్టులపై బెదిరింపులు, జర్నలిస్టులను జైలుకు పంపడం, హత్యలకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే, 2017లో బెంగళూరులో హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేష్‌.. ఫేక్‌ న్యూస్‌కు (Fake News) వ్యతిరేకంగా చేసిన పోరాట స్ఫూర్తితో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపింది.

గతేడాదిలో నెలలపాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆపరేషన్‌ను జరిపింది. టీమ్‌ జార్జ్‌  రూపొందించిన ఈ ఏఐఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కార్యకలాపాలను ట్రాక్‌ చేసింది. ఇందులో వాణిజ్య వివాదాలకు సంబంధించిన అంశాలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహించినట్లు గుర్తించింది. బ్రిటన్‌, అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్‌, మెక్సికో, సెనెగల్‌, యూఏఈతోపాటు భారత్‌ దేశాల్లోనూ ఈ తరహా ప్రచారానికి పాల్పడినట్లు కనుగొంది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా తరహాలోనే టీమ్‌ జార్జ్‌ బృందం పనిచేసిందని ఆరోపించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని