Monkeypox: ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌కూ పాకిన మంకీపాక్స్‌

ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్‌ తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యాపించింది....

Published : 22 May 2022 13:58 IST

తెల్‌ అవీవ్‌(ఇజ్రాయెల్‌): ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్‌ (Monkey Pox) తాజాగా ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌కూ వ్యాపించింది. తొలికేసు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు ప్రకటించాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తిలో లక్షణాలు గుర్తించి పరీక్షలు చేయగా.. మంకీపాక్స్‌ (Monkey Pox)గా తేలినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ప్రస్తుతం రాజధాని తెల్‌ అవీవ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది. ఇతర దేశాల నుంచి తిరిగొస్తున్న వారిలో జ్వరం, చిన్న చిన్న గాయాల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. మంకీపాక్స్‌గా అనుమానిస్తున్న ఇతర కేసుల్ని కూడా పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు స్విట్జర్లాండ్‌లో బాధితుడి కాంటాక్ట్‌లోకి వచ్చిన వ్యక్తులందరినీ పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది.

మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌లోనే తొలికేసు నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 80 కేసుల్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మరో 50 కేసులు అనుమానిత జాబితాలో ఉన్నాయని వెల్లడించింది. మశూచి తరహాలో ఉండే ఈ జబ్బును తొలుత మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోనే గుర్తించారు. కానీ బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ, అమెరికా, స్వీడన్‌, కెనడా, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలోనూ కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో చాలా మంది ఇటీవల ఆఫ్రికాకు ప్రయాణించిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. 

ఏమిటీ మంకీపాక్స్‌

మంకీపాక్స్‌ మశూచి లాంటిదే. 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో దీన్ని కనుగొన్నారు. అందుకే మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. మానవుల్లో తొలి కేసు 1970లో నమోదైంది. మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమైన వ్యాధిది. అరుదుగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ఇది ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. తాజా వ్యాప్తితో ఎక్కడా మరణాలు సంభవించలేదు.

ఎలా సోకుతుందంటే..

వ్యాధి సోకిన జంతువు కరిచినా, ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురైన మానవుడి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. తుంపర్లతోనూ వ్యాపిస్తుంది. ఎలుకలు, చిట్టెలుకలు, ఉడతల ద్వారా కూడా సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా.. ఈ వ్యాధి అంటుకొనే ప్రమాదం ఉంది. మశూచి టీకాలే మంకీపాక్స్‌ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పది మందిలో ఒకరు మాత్రమే చనిపోయే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని