Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్‌

అమెరికా(America), ఇజ్రాయెల్‌ (Israel) మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.  తాజా ఆందోళనలపై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్‌.. తమ దేశ విషయాలకు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Published : 29 Mar 2023 15:06 IST

జెరూసలేం: ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ(Judicial System)లో సంస్కరణల కోసం నెతన్యాహు ప్రతిపాదించిన కొత్త చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ప్రధాని తిప్పికొట్టారు. తమది సార్వభౌమత్వ దేశమని.. విదేశీ ఒత్తిడి ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేస్తూ మిత్రదేశంపైనే ఘాటుగా స్పందించారు.  ఇలా ఈ రెండు మిత్రదేశాల దేశాల మధ్య ఇటువంటి మాటల యుద్ధం అత్యంత అరుదనే చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇజ్రాయెల్‌ ప్రజాస్వామ్యస్థితిపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మద్దతుదారుల మాదిరిగానే నేను కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నా. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి. వాస్తవికత ఆధారంగా పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి రాజీకి వస్తారని ఆశిస్తున్నా. కానీ, ఏం జరుగుతుందో చూడాలి’ అని ఇజ్రాయెల్‌ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా చూస్తుందా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. అమెరికా స్థానం ఏంటో వారికి తెలుసని అన్నారు.

అయితే, తమ దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. ‘ఇజ్రాయెల్‌ సార్వభౌమ దేశం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకానీ, మిత్రులతో సహా విదేశాల ఒత్తిడితో కాదు’ అని అమెరికాను ఉద్దేశిస్తూ బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వ నియంత్రణకు సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రతిపాదించింది. కోర్టులు తమ పరిధి దాటి వ్యవహరించకుండా అడ్డుకునేందుకే ఈ సంస్కరణలని పేర్కొంది. కానీ, దీనిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు, తన స్వప్రయోజనాల కోసమే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని