Israel: యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!

హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్‌లో నిరసనకారులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు.

Published : 07 Jul 2024 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించి.. 250 మందికిపైగా పౌరులను బందీలుగా (Israeli Hostages) తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రతిదాడులు చేపట్టింది. ఇలా గాజా (Gaza)లో యుద్ధం ప్రారంభమై నేటికి తొమ్మిది నెలలు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే బందీలను విడిపించాలంటూ ఇజ్రాయెల్‌లో నిరసనకారులు కదం తొక్కారు. గాజాలో దశలవారీగా కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోన్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకుంది.

నిరసనకారులు దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లముందు ప్రదర్శనలు నిర్వహించారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. అక్టోబరు 7నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, బందీలుగా చిక్కుకున్నవారికి గుర్తుగా గాజా సరిహద్దు సమీపంలో 1,500 నలుపు, పసుపు రంగు బెలూన్లను ఎగురవేశారు. ఇదిలా ఉండగా.. బందీల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా విడుదలయ్యారు. మరో 120 మంది అక్కడే ఉన్నారు. 40 మంది చనిపోయి ఉండొచ్చని టెల్‌అవీవ్‌ భావిస్తోంది. తమవారిని విడిపించాల్సిందిగా నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్‌.. అడ్డుకట్టకు స్పెయిన్‌ వినూత్న ఆలోచన

ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 38 వేల మంది పాలస్తీనీయులు మృతిచెందినట్లు స్థానిక ఆరోగ్యశాఖ తెలిపింది. దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైంది. తాజాగా అమెరికా మద్దతిస్తున్న మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెప్పిన హమాస్‌.. తాజాగా ఆ కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని