Israeli Soldiers: అమానవీయం.. గాయాలతో బాధపడుతున్నా.. వాహనం బ్యానెట్‌కు కట్టేసి..

ఇజ్రాయెల్‌ సైనికులు అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా వాసిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. 

Published : 24 Jun 2024 00:10 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ సైనికులు (Israeli Soldiers) అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా పౌరుడిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ ఘటన పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ నగరంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. తమ సౌనికులు నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ చేపడుతుండగా.. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఈ క్రమంలోనే ఆ వ్యక్తికి గాయాలయ్యాయని, పాలస్తీనా మిలిటెంట్‌గా అనుమానిస్తున్నామని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది.

అయితే మిలటరీ ఉన్నతాధికారుల ఆదేశాలను, ఆపరేషన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమానితుడిని బలగాలు కట్టేసి తీసుకెళ్లడం సరికాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) పేర్కొంది. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స కోసం పాలస్తీనియన్‌ రెడ్‌ క్రిసెంట్‌కు తరలించినట్లు తెలిపింది. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జెనిన్‌తోపాటు చుట్టుపక్కల శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్‌ తరచూ దాడులకు పాల్పడుతోంది.

గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల మారణహోమంతో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 1,194 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్‌ ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే, గాజా ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 37,551 మందికి పైగా ఉంటుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని