Published : 19 Aug 2022 01:54 IST

Zaporizhzhia: అలాగైతే ఆ ప్లాంట్‌ను మూసివేస్తాం.. రష్యా హెచ్చరిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లోని జపోరిజియా(Zaporizhzhia) అణు విద్యుత్‌ కేంద్రం వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌(Ukraine) సేనలు దాడులను ఆపకపోతే.. దాన్ని మూసేస్తామని రష్యా(Russia) రక్షణశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కిరిలోవ్ గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ దాడుల కారణంగా ప్లాంట్ బ్యాక్ అప్ సపోర్ట్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఒకవేళ ప్లాంట్‌లో ప్రమాదం జరిగితే.. దాన్నుంచి వెలువడే రేడియేషన్‌తో జర్మనీ, పోలాండ్, స్లొవేకియాలూ ప్రభావితమవుతాయని చెప్పారు. మార్చిలో రష్యా దళాలు జపోరిజియా ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నిర్వహణ మాత్రం ఉక్రెయిన్‌కు చెందిన ఎనగో అటమ్‌(Energoatom) సంస్థ నిర్వహిస్తోంది. ఐరోపా(Europe)లోనే అతి పెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇది. 

అత్యంత జాగ్రత్తతో నడపాల్సిన ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం కొన్నాళ్లుగా రణరంగానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తరచూ దాడులు చోటు చేసుకోవడం వల్ల అణు విపత్తు భయం నెలకొంది. తప్పు మీదంటే మీదంటూ ఇరుదేశాలు ఆరోపించుకుంటున్నాయి. గత వారం నుంచి ఈ కేంద్రంపై వరుస దాడులు జరుగుతున్నాయి. అణు విద్యుత్‌ కేంద్రం వద్ద పరిస్థితి దారుణంగా ఉందని ఓ సమావేశంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఛైర్మన్‌ రఫెల్‌ గ్రాసీ సైతం హెచ్చరించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని సైనికరహితంగా మార్చాలని, ఉక్రెయిన్‌, అమెరికాలు డిమాండ్‌ చేశాయి. అయితే, దీనికి రష్యా అభ్యంతరం తెలిపింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని