Monkeypox: కేసులు 13 వేలకు.. ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలి..!

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటికే కేసులు దాదాపు 13 వేలకు చేరువయ్యాయి.

Updated : 15 Oct 2022 17:02 IST

మంకీపాక్స్ కలవరం: WHOకు నిపుణుల సూచన

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటికే కేసులు దాదాపు 13 వేలకు చేరువయ్యాయి. ఈ వ్యాప్తి నెమ్మదిస్తోన్న దాఖలాలు కనిపించడం లేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చర్చించాల్సి ఉందని సూచిస్తున్నారు. 

‘ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 13 వేలకు సమీపంలో ఉంది. నెమ్మదిస్తోన్న దాఖలాలు కనిపించడం లేదు. మునుపటి అంచనాల ప్రకారం.. ఆగస్టు నాటికి లక్షకు చేరువయ్యేలా సాగుతున్నాయి. త్వరలో జరగబోయే ఆరోగ్య సంస్థ సమావేశాల్లో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించే విధంగా చర్చించాల్సి ఉంది. ఈ ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు. అదేమీ జోక్ కాదు. యూఎస్‌ సహా అనేక దేశాల్లో మంకీపాక్స్‌ పట్ల స్పందిస్తోన్న తీరు సరిపోదు. పరీక్షల సంఖ్య తగినస్థాయిలో లేదు. అందుకే ఆరోగ్య అత్యయిక పరిస్థితిని త్వరితగతిన పరిశీలించి, మహమ్మారిగా ప్రకటించే దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ప్రముఖ అమెరికన్ వైద్య నిపుణుడు ఒకరు ట్విటర్‌లో స్పందించారు. 

ప్రస్తుతం మనదేశంలో కూడా మంకీపాక్స్ విస్తరించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కేరళ వాసుల్లో దీనికి గుర్తించారు. దాంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని విమానాశ్రయాలు, ఓడరేవుల అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విమానాశ్రయాలు, ఓడరేవుల ఆరోగ్య అధికారులు, ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్లు హాజరయ్యారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని సూచించినట్టు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు