Japan: ముదురుతోన్న జనాభా సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు

జపాన్‌లో జనాభా పెరుగుదల మరింత క్షీణించింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో జననాల సంఖ్య తగ్గిపోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Published : 28 Nov 2022 20:28 IST

టోక్యో: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌.. కొంతకాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న దేశ జనాభా.. ఈఏడాది కూడా రికార్డు స్థాయిలో క్షీణించింది.  గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జననాల సంఖ్య ఐదు శాతం క్షీణించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితేనని పేర్కొన్న జపాన్‌ ప్రభుత్వం.. వివాహాలు, జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించింది.

12.5కోట్ల జనాభా కలిగిన జపాన్‌లో కొన్ని సంవత్సరాలుగా జనాభా రేటు తగ్గుతూ వస్తోంది. గడిచిన రెండు దశాబ్దాలుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న ఈ సంఖ్య.. 2060 నాటికి 8.6కోట్లకు చేరుకోవచ్చని అంచనా. గతేడాది కేవలం 8,11,000 జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత క్షీణించింది. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 5,99,636 నమోదు కాగా గతేడాదితో పోలిస్తే ఇది 4.9శాతం తక్కువ. ఇలా జనాభా క్షీణించిపోవడం దేశం ‘క్లిష్టమైన పరిస్థితి’లో ఉన్నట్లు అర్థమవుతోందని జపాన్‌ చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీ హిరొకజూ మట్‌సునో వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో జాతీయశక్తిని క్షీణింపజేస్తాయని తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ కూడా ప్రధానమంత్రికి ఓ నివేదిక అందించింది.

జపాన్‌లో జీవన వ్యయం అత్యధికంగా ఉండటం, జీతాల పెరుగుదల నెమ్మదిస్తున్నట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై అస్పష్టత, ప్రయాణాల భారం, కార్పొరేట్‌ కల్చర్‌ వంటి వాటితో కుటుంబం, పెళ్లిళ్లపై జపాన్‌ యువత విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది. ఇటువంటి సమయంలో గర్భిణీలు, బాలింతలతోపాటు చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం సబ్సిడీలను ప్రకటిస్తున్నప్పటికీ జనాభా పెరుగుదలకు ఏ మాత్రం దోహదం చేయడం లేదని  సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని