Issei Sagawa: యువతిని చంపి తిన్న.. ఆ నరమాంస భక్షకుడు మృతి

నాలుగు దశాబ్దాల క్రితం ప్యారిస్‌లో ఓ యువతిని చంపి ఆమె శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి తీరు యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. జపాన్‌కు చెందిన ఆ వ్యక్తి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. 

Updated : 08 Dec 2022 16:37 IST

టోక్యో: ఓ యువతిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్న ఓ యువకుడి తీరు.. 1980ల్లో యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. పారిస్‌లో జరిగిన ఆ దారుణ ఘటనలో బాధిత యువతి నెదర్లాండ్స్‌ విద్యార్థి కాగా.. నిందితుడు జపాన్‌కు చెందిన వ్యక్తి. అయితే, ఆ కేసు నుంచి కొన్ని రోజులకే బయటపడిన అతడు.. ఇన్నేళ్లు స్వేచ్ఛగా తిరిగాడు. నరమాంసమంటే ఎంతో ఇష్టమని చెప్పుకొనే ఆ నరరూప రాక్షసుడు.. ఇటీవల అనారోగ్యం పాలై ఎట్టకేలకు ప్రాణాలు కోల్పోయాడు.

ఇస్సీ సగావా (73).. ఓ కిరాతక హంతకుడిగా జపాన్‌లో సుపరిచితమే. 1981లో పారిస్‌లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్‌వెల్ట్‌ అనే డచ్‌ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

1981లో ఈ సంఘటన జరిగింది. అయితే, ఉన్మాది మనస్తత్వం కలిగిన నిందితుడు (Issei Sagawa) విచారణకు అనర్హుడని భావించిన ఫ్రెంచ్‌ వైద్య నిపుణులు.. 1993లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. అయితే, బాధితురాలి కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు 1994లో సగావాను బహిష్కరించిన ఫ్రాన్స్‌ అధికారులు, అతడిని జపాన్‌కు పంపించివేశారు. కానీ, ‘విపరీత ప్రవర్తన’ వల్లే సగావా ఇలా చేస్తున్నాడని.. అతడికి చికిత్స అవసరం లేదని జపాన్‌ అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్‌ నుంచి అందకపోవడంతో అది మూతపడిందనే నిర్ధారణకు వచ్చారు. ఇలా కేసు విచారణ అటకెక్కడంతో హంతకుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించాడు.

జైలు శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ.. తన నేరాన్ని మాత్రం సగావా ఎన్నడూ దాచుకోలేదు. తనపై వచ్చిన అపఖ్యాతినే పెట్టుబడిగా పెట్టుకొని తన సొంత అనుభవాలను వ్యాసాల రూపంలో బహిరంగపరిచేవాడు. తాను చేసిన హత్యకు సంబంధించిన వివరాలనూ అందులో స్పష్టంగా వివరించాడు. తాను చేసిన దారుణంపై ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. మహిళలు ఎంతో రుచికరంగా ఉంటారంటూ ఓ ఇంటర్వ్యూలోనే బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతటి క్రూరుడైనప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయాడు. నరమాంస భక్షణపై ఆయనకు ఉన్న ఆసక్తి, గతంలో పారిస్‌లో చేసిన హత్య గురించిన వివరాలతో 2017లో కనిబా(Caniba) అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. చివరకు వృద్ధాప్యంలో తన సోదరుడి వద్ద కాలం గడిపిన సగావా.. శ్వాసకోస ఇబ్బందులతో నవంబర్‌ 24న చనిపోయాడు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని