Space Elevator: లిఫ్ట్‌లో అంతరిక్షానికి..!

భవనంలోని పైఅంతస్తుకు సునాయాసంగా చేరుకోవడానికి లిఫ్ట్‌ వాడుతుంటాం. అదే రీతిలో మరింత పైకెళితే? రోదసిని చేరుకోగలిగితే..! ఇదంతా సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలా అనిపిస్తోంది కదా? ఇన్నాళ్లు ఆలోచనలకే పరిమితమైన ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలకెక్కించేందుకు జపాన్‌కు చెందిన ఒక కంపెనీ కసరత్తు చేస్తోంది.

Published : 19 Jun 2024 05:32 IST

వినూత్న ప్రాజెక్టు చేపట్టిన జపాన్‌ కంపెనీ
చౌకలో రోదసియాత్రలకు వీలు
ఈ ప్రాజెక్టు వ్యయం 100 బిలియన్‌ డాలర్లు.

భవనంలోని పైఅంతస్తుకు సునాయాసంగా చేరుకోవడానికి లిఫ్ట్‌ వాడుతుంటాం. అదే రీతిలో మరింత పైకెళితే? రోదసిని చేరుకోగలిగితే..! ఇదంతా సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలా అనిపిస్తోంది కదా? ఇన్నాళ్లు ఆలోచనలకే పరిమితమైన ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలకెక్కించేందుకు జపాన్‌కు చెందిన ఒక కంపెనీ కసరత్తు చేస్తోంది. అంతరిక్ష లిఫ్ట్‌ను నిర్మించాలనుకుంటోంది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇది సాకారమైతే చాలా సులువుగా, చౌకలో రోదసిలోకి మానవులను, సరకులను చేరవేయవచ్చు. 

130 ఏళ్ల నాటి ఆలోచన 

రష్యా రాకెట్‌ శాస్త్రవేత్త కాన్‌స్టాంటిన్‌ సియోల్‌కోవ్‌స్కీ తొలుత ఈ అంతరిక్ష లిఫ్ట్‌ ఆలోచన చేశారు. 1895లో ఆయన రాసిన ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎర్త్‌ అండ్‌ స్కై’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది. అందులో ఆయన 22వేల మైళ్ల ఎత్తయిన ఒక ఊహాజనిత టవర్‌ను వర్ణించారు.  

ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజినీర్‌ యూరి ఆర్ట్స్‌టానోవ్‌ మరింత ముందుకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూ అనువర్తిత కక్ష్యలోని ఒక ఉపగ్రహం వరకూ ఒక కేబుల్‌ ఏర్పాటు చేయాలని, దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు. 

ఏమిటీ లిఫ్ట్‌? 

అలనాటి ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని జపాన్‌కు చెందిన ఒబయాషీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టీవీ టవర్‌ ‘టోక్యో స్కైట్రీ’ వంటి విప్లవాత్మక ప్రాజెక్టులను సాకారం చేసిన చరిత్ర ఈ కంపెనీది. 

ఈ సంస్థ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్‌ను స్పేస్‌ ఎలివేటర్‌గా పిలుస్తున్నారు.  భూ కక్ష్యలోకి, దాని వెలుపలికి యాత్రలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని నిర్మాణాన్ని ప్రారంభించి.. 2050 నాటికి పూర్తిచేయాలని ఒబయాషీ భావిస్తోంది.

పనిచేసేది ఇలా..

  • స్పేస్‌ ఎలివేటర్‌ నిర్మాణంలో భాగంగా పుడమి నుంచి రోదసిలోని భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహం వరకూ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్‌.. భూమితో సమానంగా భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ అది భూమికి ఎగువన నిర్దిష్టంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది. 
  • అంతరిక్ష లిఫ్ట్‌ కేబుల్‌.. భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరిస్తుంది. దీని కౌంటర్‌వెయిట్‌ ఇక్కడే ఉంటుంది. 
  • భూమధ్యరేఖా ప్రాంతంలో సముద్రంలో ‘ఎర్త్‌ పోర్ట్‌’ను ఏర్పాటు చేస్తారు. 
  • ఎర్త్‌ పోర్ట్‌లో బలాస్ట్‌ ఉంటుంది. కేబుల్‌ తన్యత (టెన్షన్‌)ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎర్త్‌పోర్ట్‌కు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాగరంలోని ఎర్త్‌ పోర్ట్‌కు చేరుకోవడానికి.. సముద్రం కిందనుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. 
  • ఈ కేబుల్‌ సాయంతో క్లైంబర్‌ అనే విద్యుదయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్లడం, కిందకి రావడం చేస్తాయి. వాటిలో మానవులు ప్రయాణించొచ్చు. సరకును రవాణా చేయవచ్చు. 

పలు కేంద్రాలు.. 

స్పేస్‌ ఎలివేటర్‌ ప్రాజెక్టులో భాగంగా కేబుల్‌ వెంబడి 36వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్‌ను నిర్మిస్తారు. సందర్శకులు అక్కడికి వెళ్లి.. శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విశ్వాన్ని వీక్షించొచ్చు. అక్కడి నుంచి భూస్థిర కక్ష్య ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. 

కర్బన నానో గొట్టం

  • ఈ కేబుల్‌ వెంబడి 3,900 కిలోమీటర్ల ఎత్తులో మార్స్‌ గ్రావిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ అంగారకుడి ఉపరితలంపై ఉండేంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాగే 8,900 కిలోమీటర్ల ఎత్తులో లూనార్‌ గ్రావిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ చందమామ ఉపరితల స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ రెండు కేంద్రాల్లో ప్రయోగాలు, వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం వంటివి చేయవచ్చు.
  • 23,750 కిలోమీటర్ల ఎత్తులో భూదిగువ కక్ష్య ద్వారాన్ని (లియో గేట్‌) ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి లియో ఉపగ్రహాలను జారవిడవొచ్చు. అవి భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరుకొని అక్కడే పరిభ్రమిస్తాయి. 
  • ఈ లిఫ్ట్‌ సాయంతో భూస్థిర కక్ష్యలో సౌర విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును భూమికి చేరవేయవచ్చు.  
  • 57వేల కిలోమీటర్ల ఎత్తులో ‘మార్స్‌ గేట్‌’ ఉంటుంది. అక్కడి నుంచి అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపొచ్చు.  
  • భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తులోని కౌంటర్‌ వెయిట్‌ కేంద్రంలో ‘సౌర కుటుంబ అన్వేషణ ద్వారం’ను ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశంలోని పరిభ్రమణ వేగాన్ని ఉపయోగించుకొని గురుగ్రహం, గ్రహశకలాల వద్దకు వ్యోమనౌకలను సులువుగా పంపొచ్చు. గ్రహశకలాల నుంచి విలువైన వనరులను సేకరించి, తిరిగి భూమికి రప్పించొచ్చని ఒబయాషీ చెబుతోంది. 

ప్రయోజనాలు

అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం రాకెట్లు వాడుతున్నారు. వాటి నుంచి భారీగా హానికర ఉద్గారాలు వెలువడుతుంటాయి. స్పేస్‌ ఎలివేటర్లకు రాకెట్‌ ఇంధనాలు అవసరం లేదు. ఇందులో విద్యుదయస్కాంత వాహనాలే ఉంటాయి. సౌర విద్యుత్‌తోనూ వాటిని నడపొచ్చు. అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. 

  • అంతరిక్ష యాత్రల ధర కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఫాల్కన్‌ 9 వ్యోమనౌకతో పౌండు (0.45 కిలోలు) బరువును అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు 1,227 డాలర్లను స్పేస్‌ఎక్స్‌ వసూలు చేస్తోంది. స్పేస్‌ ఎలివేటర్‌తో అది 57 డాలర్లకు దిగివస్తుందని ఒబయాషీ సంస్థ చెబుతోంది. 
  • సాధారణంగా అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 6-8 నెలలు పడుతుంది. స్పేస్‌ ఎలివేటర్‌ సాయంతో 3-4 నెలల్లో అక్కడికి చేరుకోవచ్చు. అవసరమైతే 40 రోజుల్లోనూ వెళ్లొచ్చు. 
  • స్పేస్‌ ఎలివేటర్‌.. రాకెట్‌ కన్నా నెమ్మదిగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అందువల్ల ఈ ప్రయాణంలో ప్రకంపనలు, కుదుపులు ఉండవు. అంతరిక్షంలోకి సున్నితమైన సాధనాలను మోసుకెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. 

సవాళ్లు

ఈ స్పేస్‌ ఎలివేటర్‌ను సాకారం చేయడం అనుకున్నంత సులువు కాదు. అనేక ఇంజినీరింగ్‌ అవరోధాలు ఉన్నాయి. 96వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్‌ను తయారుచేయడమే ప్రధాన సవాల్‌. అది తేలిగ్గా ఉండాలి. అదే సమయంలో దృఢంగానూ ఉండాలి. కర్బన నానోగొట్టాల పరిజ్ఞానం ఇందుకు అక్కరకొస్తుందని ఒబయాషీ సంస్థ చెబుతోంది. ఇది చాలా తేలిగ్గా, దృఢంగా ఉంటుంది. అయితే ఈ పదార్థంతో అంత పొడవైన కేబుల్‌ను నిర్మించడం సాధ్యమేనా అని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 

కేబుల్‌ సుస్థిరతను కాపాడాలి. ఉరుములు, మెరుపులు, తుపాన్లు వంటి తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు, అంతరిక్ష శకలాల నుంచి ఈ ఎలివేటర్‌కు ముప్పు పొంచి ఉంటుంది. వీటిని అధిగమించాలి. 


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని