మద్యం పారాలి.. ఆదాయం పెరగాలి.. కొత్త ఆలోచనలు చెప్పండి..!

యువత నచ్చినంత మద్యం తాగేలా ప్రోత్సహించేందుకు కొత్త ఆలోచనలు చెప్పమంటోంది జపాన్ ప్రభుత్వం. 

Published : 21 Aug 2022 01:38 IST

టోక్యో: యువత నచ్చినంత మద్యం తాగేలా ప్రోత్సహించేందుకు కొత్త ఆలోచనలు చెప్పమంటోంది జపాన్ ప్రభుత్వం. అందుకోసం జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తోంది. గత 31 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మద్యం ఆదాయం పడిపోవడంతో వినియోగాన్ని పెంచేందుకు ‘Sake Viva!’ పేరిట ప్రచారం ప్రారంభించింది. నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. మద్యానికి ఆదరణను పునరుద్ధరించేందుకు 20 నుంచి 39 ఏళ్ల మధ్య యువత తగిన ఆలోచనలతో రావాలని ఎన్‌టీఏ కోరింది. అలాగే ఇంట్లో మద్యపానం చేసే అలవాటును ప్రోత్సహించే ఆలోచనలు చెప్పాలంది. ఈ పోటీల్లో పాల్గొనేవారికి ప్రవేశ రుసుము లేదని, టోక్యోలో నవంబర్ 10న తుది విజేతలను ప్రకటిస్తామని తెలిపింది.

జపాన్‌ మీడియా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 1995లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల మద్యాన్ని సేవించగా.. 2020లో అది 75 లీటర్లకు పడిపోయింది. దాంతో 1980లో పన్ను ఆదాయంలో మద్యం వాటా 5 శాతంగా ఉండగా.. 2011లో అది 3 శాతానికి తగ్గింది. 2020 వచ్చే సరికి అదికాస్తా 1.7 శాతానికి పడింది. దీనికి జపాన్ యువత తమ తల్లిదండ్రుల కంటే తక్కువ మద్యాన్ని సేవించడమే కారణమని ఎన్‌టీఏ గుర్తించింది. కరోనా మహమ్మారి రాకతో యువత జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, కట్టడి ఆంక్షలతో జపనీస్ సేక్‌, శోచు, విస్కీ, బీర్, వైన్‌ వినియోగం మరింతగా తగ్గిపోయినట్లు అక్కడి వార్త సంస్థలు వెల్లడించాయి. అక్కడ వృద్ధ జనాభా పెరుగుదల కూడా ఓ కారకమని పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని