No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్‌ బ్రేక్‌.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా

ధూమపానంపై (Smoking) ఉన్న నిషేధాన్ని అతిక్రమిస్తున్న ముగ్గురు జపాన్‌ (Japan) ప్రభుత్వ అధికారులకు భారీ జరిమానా పడింది. వీరిలో ఓ ఉన్నతాధికారి ఏకంగా 4500 సార్లు స్మోకింగ్‌ బ్రేక్‌ తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు.

Published : 30 Mar 2023 01:52 IST

ఒసాకా: బహిరంగ, రద్దీ ప్రదేశాల్లో ధూమపానం (Smoking) చేయడాన్ని అనేక దేశాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు పౌరులు మాత్రం నిబంధనలు అతిక్రమిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో జపాన్‌కు (Japan) చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి గడిచిన 14ఏళ్లలో ఏకంగా 4500 సార్లు స్మోకింగ్‌ బ్రేక్‌ (Smoking Break) తీసుకున్నాడట. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానా విధించారు. అతడికి 14700 సింగపూర్‌ డాలర్ల (రూ.8.8లక్షలు) జరిమానా విధించినట్లు ఆ జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

జపాన్‌లోని ఒసాకా నగరానికి చెందిన ఆర్థికశాఖలో డైరెక్టర్‌ స్థాయి ఉన్నతాధికారితోపాటు (61) మరో ఇద్దరు అధికారులు కార్యాలయ సమయంలోనే ధూమపానం చేస్తున్నారట. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోన్న ఈ ముగ్గురుపై 2022 సెప్టెంబర్‌లో ఆ కార్యాలయ మానవ వనరుల విభాగానికి ఫిర్యాదు వెళ్లింది. దీంతో వారికి సమన్లు జారీచేసిన అధికారులు.. మరోసారి ధూమపానం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని ఆ అధికారులు.. అలాగే నిబంధనలు అతిక్రమిస్తూ స్మోకింగ్‌ బ్రేక్‌ తీసుకుంటున్నారు. దీనిపై గతేడాది డిసెంబర్‌లో మరోసారి ఫిర్యాదు రావడంతో విచారించిన అధికారులకు.. తాము ధూమపానం చేయలేదని అబద్ధాలు చెప్పారట.

దీంతో ఆఫీస్‌ సమయంలో వారు తీసుకున్న బ్రేక్‌ల వివరాలను బయటకు తీశారు. వీరిలో డైరెక్టర్‌ స్థాయి అధికారి డ్యూటీ సమయంలో ఏకంగా 355 గంటల 19నిమిషాలు ధూమపానానికే కేటాయించిన విషయాన్ని జిల్లా అధికారులు బయటపెట్టారు. ఇలా గడిచిన 14 ఏళ్లలో 4512 సార్లు స్మోకింగ్‌ బ్రేక్‌ తీసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన అధికారులు.. జీతంలో కోత (ఆరునెలల పాటు పది శాతం) విధించడంతోపాటు 1.44 మిలియన్‌ యెన్‌లను జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

మరోవైపు ఒసాకాలో 2019లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ హైస్కూల్‌లో పనిచేసే టీచర్‌ 3400 సార్లు స్మోకింగ్‌ బ్రేక్‌ తీసుకున్నాడట. దీంతో అతడిపై చర్యలు తీసుకున్న అక్కడి విద్యాశాఖ.. 10లక్షల యెన్‌లు జరిమానా విధించారు. అయితే, ఇది జరిగిన తర్వాత కూడా.. ‘ఇదో చెడు అలవాటు అయినప్పటికీ దీన్ని మానుకోలేకపోతున్నాను’ అని అక్కడి బోర్డుమీద సదరు ఉపాధ్యాయుడు రాయడం గమనార్హం.

ధూమపానం నిషేధం విషయంలో ప్రపంచంలో అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే ప్రాంతాల్లో జపాన్‌లోని ఒసాకా ఒకటి. ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధాన్ని పదిహేనేళ్ల క్రితం నుంచే కఠినంగా అమలు చేస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనివేళల్లో పొగతాగడంపై నిషేధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని