Bill Gates: ఆమెతో బంధం గురించి బిల్‌గేట్స్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి..!

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌(Bill Gates).. మెలిందా గేట్స్‌తో విడిపోయిన సమయంలో ఆయన గురించి అనేక ఇబ్బందికర కథనాలు బయటకువచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కథనం కూడా ఆ తరహాలోనిదే.

Updated : 23 May 2023 15:51 IST

వాషింగ్టన్‌: సెక్స్ కుంభకోణం కేసులో నేరస్థుడు, అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌(Jeffrey Epstein), అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్‌(Bill Gates) మధ్య సంబంధాల గురించి మరోసారి వార్తలు వచ్చాయి. ఓ రష్యన్‌ క్రీడాకారిణి(Russian bridge player Mila Antonova)తో ఉన్న అఫైర్ విషయంలో గేట్స్‌ను జేఫ్రీ బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నించాడని అంతర్జాతీయ వార్త కథనం వెల్లడించింది. దాని ప్రకారం.. 

2010లో గేట్స్‌.. రష్యా బ్రిడ్జ్‌ ప్లేయర్ మిలా అంటోనోవా(Mila Antonova)ను కలుసుకున్నారు. ఆ ఆట మీద ఉన్న ఆసక్తి ఇద్దరి మధ్య పరిచయానికి దారితీసింది. అప్పుడు ఆమె రెండుపదుల వయస్సులో ఉంది. అప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో మిలా.. గేట్స్ గురించి ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరి మధ్య బంధాన్ని గుర్తించిన ఎప్‌స్టీన్‌.. దాన్నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. 2017లో గేట్స్‌కు ఒక ఈ-మెయిల్ పంపి బ్లాక్‌ మెయిల్ చేయాలని చూశాడు. మిలా కోడింగ్ కోర్సు కోసం తాను డబ్బు చెల్లించానని, దానిని తిరిగి ఇవ్వాలని అందులో గేట్స్‌ను డిమాండ్ చేశాడు. ఒకవేళ దానిని ఇవ్వకపోతే.. వారి బంధం గురించి బయటపెడతానని బెదిరించినట్లు ఆ కథనాన్ని బట్టి తెలుస్తోంది. 

2011 నుంచి గేట్స్‌, ఎప్‌స్టీన్‌ తరచూ కలుసుకునేవారు. అప్పటికే ఎప్‌స్టీన్ సెక్స్‌ కుంభకోణంలో దోషిగా తేలాడు. ఈ సమావేశాలు గేట్స్ మాజీ భార్య మెలిందా గేట్స్‌కు నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమె 2022లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. సేవా కార్యక్రమాల నిమిత్తం వారిద్దరూ తరచూ కలుసుకునేవారని, అయితే తర్వాత గేట్స్(Bill Gates) గత బంధం గురించి తెలిసిన ఎప్‌స్టీన్.. వాటి నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని కుబేరుడి ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అలాగే తన ఛారిటీ ఫండ్‌కు గేట్స్‌ నుంచి విరాళం పొందేందుకు విఫలయత్నం చేశాడని చెప్పారు. ఆ తర్వాత మెయిల్‌ ద్వారా బెదిరింపులకు దిగాడని తెలిపారు.   

మిలా, ఎప్‌స్టీన్‌ ఎలా కలిశారంటే..?

మిలా, ఎప్‌స్టీన్‌ మధ్య ఏర్పడిన పరిచయం గురించి మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమె తన ఆటను ఇతరులకు నేర్పించాలని, అందుకోసం ఒక సంస్థను ప్రారంభించాలని భావించారు. స్పాన్సర్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడు గేట్స్‌ సన్నిహితుడు బోరిస్ నికోలిక్.. ఆమెను ఎప్‌స్టీన్‌కు పరిచయం చేశాడు. అలా 2013లో వారిద్దరూ కలుసుకున్నారు. వెంచర్ కోసం డబ్బులివ్వలేనన్న అతడు.. ఆమె కోడింగ్ కోర్సు కోసం అయ్యే ఖర్చును మాత్రం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

ఇదీ చదవండి: అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్‌ సెక్స్‌ కుంభకోణం ఇది..!

‘అతడు అలా ఎందుకు చేశాడో తెలీదు. దాని గురించి అడిగితే.. తన దగ్గర చాలా డబ్బు ఉందని, అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోవాలన్నదే తన ఆలోచన అని చెప్పాడు’ అని ఆమె వెల్లడించింది. అలాగే ఆమె కొన్నిరోజులు న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఆమె ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చాడట. అయితే ఆ సమయంలో ఎప్‌స్టీన్‌(Jeffrey Epstein)తో ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆ సమయంలో అతడి వ్యవహారాల గురించి తనకు తెలీదని చెప్పారు. అలాగే గేట్స్‌(Bill Gates)తో బంధం గురించి ప్రశ్నించగా.. స్పందించడానికి నిరాకరించారు.

మరోవైపు దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్‌ - మెలిందా(Bill & Melinda Gates) దంపతులు రెండేళ్ల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట చెప్పనప్పటికీ.. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు