Jail Attack: నైజీరియా కారాగారంపై దాడి.. 600 మంది ఖైదీలు పరార్‌

నైజీరియా (Nigeria) రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై (Jail) తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు.

Published : 07 Jul 2022 01:39 IST

అబూజ: నైజీరియా (Nigeria) రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై (Jail) తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్‌ మిలిటెంట్‌ వ్యతిరేక ముఠాలే ఈ దాడికి కారణమని నైజీరియా అధికారులు అనుమానిస్తున్నారు.

మంగళవారం రాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు.. కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు.. పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారు. బోకో హరమ్‌గా (Boko Haram) పిలిచే ఇస్లామిక్‌ మిలిటెంట్‌ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు నైజీరియా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి శువాయిబ్‌ బెల్గోర్‌ పేర్కొన్నారు. ఆ గ్రూపునకు చెందిన వారు ఎక్కువ మంది ఖైదీలుగా ఉన్నారని.. వారిని విడిపించుకు వెళ్లేందుకే దుండగులు ఈ పథకం రచించారని అన్నారు.

20 కోట్లకుపైగా జనాభా కలిగిన నైజీరియాలో బోకోహరం ముఠాలు జైళ్లపై దాడులకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, నైజీరియా రాజధానిలో చోటుచేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే, ఈశాన్య నైజీరియాలో తీవ్రవాద ముఠాలు సృష్టిస్తోన్న నరమేధానికి ఇప్పటివరకు 35వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మిలిటెంట్ల దాడుల భయాలతో దాదాపు 20లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఇలా సుదీర్ఘ కాలంగా అక్కడ నెలకొన్న అస్థిరత వల్ల ఆకలి, ఆరోగ్య సేవలలేమితో దాదాపు 3లక్షలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని