Ukraine: భీకర యుద్ధం వేళ.. ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన జిల్‌ బైడెన్‌

భీకర యుద్ధం కొనసాగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. మాతృ దినోత్సవం వేళ ఉక్రెయిన్‌లో అడుగుపెట్టిన జిల్‌ బైడెన్‌.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలేనా జెలెన్‌స్కాతో సమావేశమయ్యారు.

Published : 08 May 2022 23:43 IST

తమ మద్దతు ఉందని చెప్పేందుకేనన్న అమెరికా ప్రథమ మహిళ

కీవ్‌: భీకర యుద్ధం కొనసాగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. మాతృ దినోత్సవం వేళ ఉక్రెయిన్‌లో అడుగుపెట్టిన జిల్‌ బైడెన్‌.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలేనా జెలెన్‌స్కాతో సమావేశమయ్యారు. రష్యా జరుపుతోన్న దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌కు అమెరికా పూర్తి మద్దతు తెలుపుతోందనే భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే తాను ఈ పర్యటన చేపట్టినట్లు జిల్‌ బైడెన్‌ వెల్లడించారు.

‘ఈ యుద్ధం ఎంతో క్రూరమైనది, ఇది ఇప్పటితో ఆగిపోవాలని కోరుకుంటున్నాను. ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికా ప్రజల మద్దతు ఉంటుందని చెప్పడానికే మాతృ దినోత్సవం రోజున ఇక్కడకు రావాలని నిర్ణయించుకున్నాను’ అని అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న శరణార్థుల కేంద్రంలో ఉక్రెయిన్‌ మహిళలతో ముచ్చటించారు. ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా జిల్‌ బైడెన్‌ తొలుత స్లొవేకియాకు చేరుకొని అక్కడనుంచి రోడ్డు మార్గంలో ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతమైన ఉజుహరొడ్‌ పట్టణానికి చేరుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు జిల్‌ బైడెన్‌ అక్కడే గడిపారు.

ఇదిలాఉంటే, రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న యుద్ధంతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సందర్శిస్తారనే వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఆయుధాలతో పాటు వివిధ మార్గాల్లో ఉక్రెయిన్‌కు సహాయం అందిస్తోన్న అగ్రరాజ్యం.. అధ్యక్షుడి పర్యటనలో మరింత భరోసా నింపే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. జో బైడెన్‌ ఉక్రెయిన్‌ పర్యటన పరిశీలనలో ఉందని అక్కడి నిఘా విభాగం వెల్లడించిన కొన్ని రోజుల్లోనే అమెరికా ప్రథమ మహిళ ఉక్రెయిన్‌లో పర్యటించి ఆశ్చర్యపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని