Joe Biden: రష్యాపైకి అమెరికా తయారీ ఆయుధాలు

ఖర్కివ్‌ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి ‘అమెరికా తయారీ ఆయుధాలు’ వినియోగించేందుకు ఉక్రెయిన్‌ను అనుమతించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు.

Updated : 01 Jun 2024 06:04 IST

ఖర్కివ్‌ వరకు ఆంక్షల పాక్షిక సడలింపు
బైడెన్‌ నిర్ణయంతో ఉక్రెయిన్‌కు ఊరట
జర్మనీ నుంచి కూడా అలాంటి అంగీకారం

వాషింగ్టన్‌: ఖర్కివ్‌ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి ‘అమెరికా తయారీ ఆయుధాలు’ వినియోగించేందుకు ఉక్రెయిన్‌ను అనుమతించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు. ఇదివరకు విధించిన మౌఖిక ఆంక్షలను ఈ మేరకు పాక్షికంగా సడలించారు. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణులను, ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపల దాడులకు ఉక్రెయిన్‌ ఉపయోగించరాదనే విధానంలో ఎలాంటి మార్పులేదని, ప్రస్తుత సడలింపు ఖర్కివ్‌ వరకేనని స్పష్టంచేశాయి. ఆ ప్రాంతంలో రష్యా దళాలు దాడికి దిగినా, అలాంటి సన్నాహాల్లో ఉన్నా, వాటిని ఎదుర్కొనేందుకు మాత్రం తాము సరఫరా చేసిన ఆయుధాలు వాడుకోవచ్చని వివరించాయి. ఉక్రెయిన్‌లో రెండో పెద్ద నగరమైన ఖర్కివ్‌.. రష్యా సరిహద్దుకు కేవలం 20 కి.మీ. దూరంలో ఉంటుంది. రష్యా దాడుల నుంచి దీనిని కాపాడుకునేందుకు అమెరికా ఆయుధాలను వాడేలా అనుమతివ్వాలని ఉక్రెయిన్‌ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇటీవల కీవ్‌కు వెళ్లినప్పుడు కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దీనిపై ప్రత్యేకంగా అభ్యర్థించారు. బ్లింకెన్‌ ఆ సందేశాన్ని బైడెన్‌కు చేరవేయడంతో మార్గం సుగమమైంది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనా ఇప్పటివరకు తమ ఆయుధాలను రష్యాపై ఉపయోగించడానికి అమెరికా అంగీకరించలేదు. వీటికి అనుమతిస్తే రష్యాను రెచ్చగొట్టినట్లయి, యుద్ధం మరింత విస్తృతమవుతుందని అగ్రరాజ్యం ఉద్దేశం. ఇతర దేశాల నుంచి కూడా సూచనలు రావడంతో ఇప్పుడు వైఖరి మార్చుకుంది. అమెరికా తాజా నిర్ణయం దరిమిలా జర్మనీ కూడా తమ ఆయుధాలను రష్యాపై వినియోగించడానికి ఉక్రెయిన్‌ను అనుమతించింది. 

  • ఖర్కివ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ సముదాయంపై రష్యా జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లినవారిపైనా దాడి కొనసాగింది. 
  • పాశ్చాత్య దేశాల ఆయుధాలను ఉపయోగించి రష్యాపైకి ఉక్రెయిన్‌ దాడులు చేయాలని కొన్ని నాటో దేశాలు చేస్తున్న ప్రతిపాదనను హంగరీ వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనలు ఐరోపాను విధ్వంసం వైపు తీసుకువెళ్తాయని అభిప్రాయపడింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు