Ukraine Crisis: పోలాండ్ పర్యటనకు బైడెన్.. ఉక్రెయిన్ పరిస్థితిపై కీలక భేటీలు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం కీలక ఐరోపా పర్యటన చేపట్టనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు......

Published : 21 Mar 2022 16:06 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం కీలక ఐరోపా పర్యటన చేపట్టనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు. పోలండ్‌ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు నెలరోజులు కావస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పర్యటనలో భాగంగా బైడెన్ మొదట బ్రస్సెల్స్ చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్​తో భేటీ కానున్నారు. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్​ను సందర్శించే ఆలోచన బైడెన్​కు లేదని శ్వేతసౌధం వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా, నాటో, ఐరోపా దేశాలు ఐక్యంగా ముందుకుసాగుతున్నాయి. రష్యా చేపట్టిన సైనిక చర్య వారి భద్రకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా భావిస్తున్నాయి. అయితే నాటో సభ్యదేశం కానప్పటికీ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి. యుద్ధ సమయంలో ఉక్రెయిన్​కు మిగ్ ఫైటర్ జెట్లు నాటో ఎయిర్​బేస్ ద్వారా సరఫరా చేయాలని పోలాండ్​ మార్చి 9న చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. అలా చేస్తే యుద్ధానికి ఇంకా ఆజ్యం పోసినట్లు అవుతుందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్​కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని