Iran: ఆ ఖాళీ కుర్చీ వెనుక ఓ ఆసక్తికర ఘటన..!

ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా యంకర్‌ ఎదుట ఖాళీ కుర్చి ఉన్న ఆ ఫొటో వెనుక ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. బ్రిటన్‌లో ఓ ఇరాన్‌కు చెందిన వ్యక్తికి జన్మించింది.

Updated : 23 Sep 2022 10:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్‌ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఆ ఫొటో వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ ఫొటోలోని మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. ఇరానీ-బ్రిటన్‌ కుటుంబంలో జన్మించింది. 11ఏళ్లు వచ్చే వరకు ఇరాన్‌లోనే పెరిగింది. ఆమె ప్రస్తుతం సీఎన్‌ఎన్‌లో చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్‌లో కూడా ఓ షో చేస్తోంది. ఆమె తన ట్విటర్‌లో ఆ ఫొటోను పోస్టు చేసి.. దాని వెనుక కథను మొత్తం వివరించింది. అదేంటంటే..

న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిల్లో ప్రసంగించేందుకు ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న్యూయార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో రైసీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అమన్పూర్‌ కొన్ని వారాల ముందే ప్లాన్‌ చేశారు. ఇందుకోసం ఆమె బృందం దాదాపు 8 గంటలు కష్టపడి సెట్‌, ట్రాన్స్‌లేషన్‌ యంత్రాలు, లైట్లు, కెమెరాలను సిద్ధం చేసింది. మరో 40 నిమిషాల్లో ఇరాన్‌ అధ్యక్షుడు వస్తారనగా.. ఇంతలో ఆయన సహాయకుడు రంగంలోకి దిగాడు. అమన్పూర్‌ను ‘హెడ్‌స్కార్ఫ్‌’ ధరించాల్సిందిగా అధ్యక్షుడు కోరుతున్నారని తెలిపాడు. దీనిని ఆమె చాలా గౌరవంగా తిరస్కరించింది. తాము న్యూయార్క్‌లో ఉన్నామని, ఇక్కడ హెడ్‌స్కార్ఫ్‌కు సంబంధించి ఎటువంటి చట్టాలు, ఆచారాలు లేవని అతడికి వివరించింది. గతంలో ఇరాన్‌ అధ్యక్షులను వారి దేశం బయట ఇంటర్వ్యూలు చేసిన సమయంలో కూడా ఎటువంటి హెడ్‌స్కార్ఫ్‌ ధరించాల్సిన అవసరం రాలేదని అమన్పూర్‌ తెలిపింది. కానీ, ఆ సహాయకుడు అవేవీ పట్టించుకోలేదు. అమన్పూర్‌ హెడ్‌స్కార్ఫ్‌ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చిచెప్పాడు. ఇది గౌరవానికి సంబంధించిన అంశమని.. ఇప్పుడు ఇరాన్‌లో పరిస్థితికి కూడా ఇదే కారణమని అతడు పేర్కొన్నాడు. కానీ, అమన్పూర్‌ మాత్రం అంగీకరించకుండా అక్కడి నుంచి వచ్చేశారు. దీంతో ఇంటర్వ్యూ రద్దైంది. ‘‘ఓ పక్క  ఇరాన్‌లో జరుగుతోన్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్‌ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం’’ అంటూ అమన్పూర్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ ఫొటోతోపాటు జరిగిన ఘటనను వివరిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఘర్షణల కారణంగా గత ఆరు రోజుల్లో దేశవ్యాప్తంగా 31 మంది దుర్మరణం పాలయ్యారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో మాసా అమీని అనే యువతిని ఇటీవల నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ గతవారం మరణించింది. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో గతవారాంతంలో మొదలైన నిరసనలు.. క్రమంగా దేశమంతటికీ పాకాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని