TikTok: టిక్‌టాక్‌ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో

తమ దేశంలో టిక్‌టాక్‌(TikTok)పై కఠిన చర్యలు తీసుకోవడంతో తనకు వ్యక్తిగతంగా ఉపకరించిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు. ఆయన ఈ మాట ఎందుకు అన్నారంటే..? 

Published : 26 Mar 2023 01:29 IST

అటావా: యూజర్ల డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు టిక్‌టాక్‌(TikTok)పై నిషేధం విధిస్తున్నాయి. ప్రభుత్వ పరికరాల నుంచి ఈ యాప్‌ను తీసేయాలని కెనడా ప్రభుత్వం ఇదివరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Canadian Prime Minister Justin Trudeau) తాజాగా మాట్లాడారు. ఆ నిషేధం వల్ల తనకు వ్యక్తిగతంగా కూడా లాభమని వెల్లడించారు. 

ఈ యాప్‌ ద్వారా యూజర్ల సమాచారం చైనా తెలుసుకునే వీలుందని ట్రూడో వ్యాఖ్యానించారు. ‘దీనిపై విధించిన కఠిన చర్యల వల్ల నాకు వ్యక్తిగతంగా లాభముంది. నా పిల్లలు ఇక టిక్‌టాక్‌ను వాడే వీలుండదు. వారి గోప్యత, భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. అయితే వారు ప్రభుత్వం నుంచి పొందిన ఫోన్లను వినియోగిస్తున్నారు. దాంతో వారు టిక్‌టాక్‌ వాడలేరు. కానీ నా పిల్లలు ఈ విషయంలో అసహనంతో ఉన్నారు. డాడ్‌.. ఇది మా ఫోన్లకు కూడా వర్తిస్తుందా..? అని ప్రశ్నించారు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. 

రెండురోజుల క్రితం టిక్‌టాక్‌(TikTok) సీఈఓషో జి చ్యూను యూఎస్ కాంగ్రెస్ ప్రశ్నించింది. తమ సంస్థ యూజర్ల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదంటూ సీఈఓ తమ విధానాలను పునరుద్ఘాటించారు. అలాగే తన పిల్లలు సింగపూర్‌లో ఉంటారని, అక్కడ టిక్‌టాక్‌ చైల్డ్ వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో వారు ఆ యాప్‌ను వాడరని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని