Afghanistan: కాబుల్‌ పాఠశాలల్లో వరుస పేలుళ్లు.. పదుల సంఖ్యలో మృతి!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి.

Updated : 19 Apr 2022 16:57 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో పదిమందికిపైగా విద్యార్థులు మృత్యువాతపడినట్లు సమాచారం. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వరుస పేలుళ్లకు ఆత్మాహుతి దాడే కారణంగా అనుమానిస్తున్నారు.

మంగళవారం ఉదయం తొలుత పశ్చిమ కాబుల్‌లోని ముంతాజ్‌ స్కూల్‌లో తొలి పేలుడు సంభవించింది. అనంతరం రెండో పేలుడు అబ్దుల్‌ రహీం షాహిద్‌ స్కూల్‌లో చోటుచేసుకున్నట్లు అక్కడి వార్త సంస్థలు వెల్లడించాయి. ‘పాఠశాలలకు సమీపంలో వెనువెంటనే మూడు పేలుళ్లు సంభవించాయి. వాటిలో అనేక మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉంది’ అని కాబుల్‌ పోలీస్‌ విభాగం అధికార ప్రతినిధి ఖాలిద్‌ జద్రాన్‌ వెల్లడించారు. అయితే, ఈ దాడులకు ఎవరు పాల్పడారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు.

ఇదిలా ఉంటే, అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాము అధికారం చేపట్టిన అనంతరం దేశాన్ని సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో అఫ్గాన్‌లో దాడులు పెరిగిపోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, తాజా దాడులను ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో గతంలోనూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇటువంటి దాడులకు తెగబడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని