Kate Middleton: తొలిసారి బయటకు కేట్‌ మిడిల్టన్‌.. క్యాన్సర్‌ చికిత్సపై భావోద్వేగ పోస్టు..!

క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్.. వ్యాధి నిర్ధరణ అనంతరం తొలిసారి బయటకు వచ్చారు.

Published : 15 Jun 2024 19:09 IST

లండన్: బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్‌ (Cancer) బారినపడిన సంగతి తెలిసిందే. మార్చిలో ఈ వ్యాధి నిర్ధరణ ప్రకటన చేసినప్పటినుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె.. తొలిసారి బయటకు వచ్చారు. దేశ రాజధాని లండన్‌లో నిర్వహించిన ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ వేడుకలో పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తన పిల్లలతో కలిసి బగ్గీలో కూర్చుని కనిపించారు. అంతకుముందు ‘ఎక్స్‌’ వేదికగా ఆమె ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు.

‘‘క్యాన్సర్‌ చికిత్స మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పురోగతి కనిపిస్తోంది. కానీ, కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి తెలుసు.. జీవితంలో మంచి, చెడ్డ రోజులు ఉంటాయని. కొన్ని రోజులు బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు.. మంచి అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటా. ఈ క్రమంలోనే రాజు అధికారిక పుట్టిన రోజు పరేడ్‌కు హాజరవుతున్నా. మరికొన్ని ప్రజా కార్యక్రమాల్లోనూ భాగం కావాలనుకుంటున్నాను. అయితే.. నేనింకా కష్టాల నుంచి బయటపడలేదని తెలుసు. అనిశ్చిత పరిస్థితుల్లో ఎలా ఓపికగా ఉండాలో నేర్చుకుంటున్నాను. నా శరీరం చెప్పే మాటలు వింటున్నా. నయం కావడానికి సమయం పడుతుందనే విషయం అర్థంచేసుకున్నా. ఈ కష్టకాలంలో అండగా నిలుస్తోన్న అందరికీ కృతజ్ఞతలు. మీ తోడ్పాటు నా ప్రపంచాన్ని మార్చేసింది’ అని కేట్‌ మిడిల్టన్‌ పేర్కొన్నారు.

బ్రిటన్‌లో రాజు ఒక్కడే.. పుట్టిన రోజులు రెండు!

క్యాన్సర్‌తో పోరాడుతున్నవారు, వారి కుటుంబీకుల విషయంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ప్రకటన అర్థవంతంగా ఉందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నారు. ‘‘తాము అదేవిధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు కేట్‌ మాటల్లో వారు గుర్తిస్తారు. ఆమె నుంచి జీవితంపై ఆశ, ప్రేరణను పొందుతారు’’ అని కేట్‌ పోస్టుపై స్పందించారు. దేశం మొత్తం ఆమె వెనక ఉందన్న విషయం తెలుసని చెప్పారు.

ఏంటీ ట్రూపింగ్‌ ది కలర్‌..?

‘ట్రూపింగ్‌ ది కలర్‌’ అనేది ఏటా నిర్వహించే పరేడ్‌. బ్రిటన్‌ రాజు అధికారిక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాజ కుటుంబానికి చెందిన దాదాపు అందరూ దీనికి హాజరవుతారు. సైనిక సంపత్తి, రాజ వైభవాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి హార్స్‌ గార్డ్స్‌ పరేడ్‌ వరకు కవాతు సాగుతుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే లండన్‌ వీధుల్లో సందడి నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని