UK New PM: రిషి సునాక్‌కు షాకిచ్చిన బారిస్టర్‌.. ఎవరీ కీర్‌ స్టార్మర్‌..?

Keir Starmer: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్‌ స్టార్మర్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..?

Updated : 05 Jul 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది 2019 డిసెంబరు 12-13.. బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో (UK Elections) ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 85 ఏళ్లలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. సరిగ్గా ఏడాది తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్నారు కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer). ఓటమి బాధ నుంచి నేతలు, కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఐదేళ్లలో పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ఆధునికీకరించి ‘మారిన లేబర్‌ పార్టీ’గా ప్రజల ముందుంచారు. ఆ నిర్విరామ ప్రయత్నమే 14 ఏళ్ల తర్వాత లేబర్‌ పార్టీ (Labour Party)కి మళ్లీ అధికారం తెచ్చిపెట్టింది. ఆయనను ప్రధాని పీఠంపై కూర్చోబెడుతోంది. ఇంతకీ ఎవరాయన..?

9 ఏళ్లకే ప్రధాని పదవి..

61 ఏళ్ల స్టార్మర్‌ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్‌ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ పార్టీ విజయం సాధించడంతో ప్రధానమంత్రి పదవి అందుకోబోతున్నారు. బ్రిటన్‌ చరిత్రలో గత ఐదు దశాబ్దాల్లో ఇంత ఎక్కువ వయసున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి.

నాటి బారిస్టర్‌..

1962 సెప్టెంబరు 2న జన్మించిన స్టార్మర్‌ బాల్యమంతా లండన్‌ శివారుల్లోనే గడిచింది. తల్లి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవారు. ఆమె అరుదైన వ్యాధితో బాధపడేవారు. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే. న్యాయవిద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్‌ ఐర్లాండ్‌ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు.

క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్‌

ఐదేళ్ల తర్వాత లేబర్‌ పార్టీ నాయకుడు, ప్రధాని గార్డెన్‌ బ్రౌన్‌ హయాంలో ఇంగ్లాండ్‌, వేల్స్‌కు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఖర్చులను దుర్వినియోగం చేసే ఎంపీలు, ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లో నిలిచారు. న్యాయవృత్తిలో ఆయన చేసిన సేవలకు గానూ 2014లో రాణి ఎలిజెబెత్‌ 2 నుంచి నైట్‌హుడ్‌ అందుకున్నారు. 2015లో ఆయన ఎంపీగా గెలవడానికి కొద్ది నెలల ముందే తల్లి దూరమైంది. ఆ బాధను బిగపట్టి ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్మర్‌కు భార్య విక్టోరియా ఇద్దరు పిల్లలున్నారు.

లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. దాన్ని స్టార్మర్ గట్టిగా తిప్పికొట్టారు. యూకేలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామనే హామీతో ముందుకెళ్లారు. కన్జర్వేటివ్‌ పార్టీలో ఉన్న అస్థిరతను ఎత్తిచూపారు. ఇవన్నీ లేబర్‌ పార్టీ విజయానికి కృషి చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని