Khalistan Supporters: కెనడాలో ఖలిస్థాన్‌ సానుభూతిపరుల దుశ్చర్య..

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌ దీప్‌ నిజ్జర్‌ హత్యకు నిరసనగా కెనడాలో భారత దౌత్య కార్యాలయాల ముందు చేపట్టిన నిరసనల్లో ఖలిస్థాన్‌ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు.

Published : 26 Sep 2023 12:37 IST

టొరంటో: భారత్‌కు వ్యతిరేకంగా కెనడా (Canada)లో ఖలిస్థాన్‌ మద్దతుదారులు (Khalisthan Supporters) పేట్రేగిపోతున్నారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు నిరసనగా కెనడాలోని భారత్‌ దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. భారత జాతీయ జెండాను అవమానించారు. ప్రదాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టొరంటోలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 100 మంది ఖలిస్థాన్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. మరోవైపు వాంకోవర్‌, ఒట్టవాలో కూడా నిరసనలు కొనసాగాయి. 

భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ

కొద్ది రోజుల క్రితం ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురయ్యాడు. అతని హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అయితే, ట్రూడో ఆరోపణల్లో వాస్తవం లేదని భారత్ వ్యాఖ్యానించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ శాఖలు తమ పౌరులకు కీలక సూచనలు చేశాయి. కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కెనడా సైతం అత్యవసరమైతే తప్ప భారత్‌లో పర్యటించవద్దని తమ దేశ పౌరులకు సలహాను జారీ చేసింది. 

ఆధారాలు లేకుండా ట్రూడో ఆరోపణలా..? భారత్‌కు మద్దతుగా శ్రీలంక మంత్రి

ఈ వివాదంపై కెనడా రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్ స్పందిస్తూ.. భారత్‌తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్‌ హత్యకు సంబంధించి తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలక భాగస్వామి అని.. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం.. పౌరుల ప్రాణాలు కూడా తమకు చాలా విలువైనవని పేర్కొన్నారు. నిజ్జర్‌ హత్యలో తమ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, దీనికి భారత్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ మాత్రం కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు