Italy: ఇటలీలో మహాత్ముడి విగ్రహంధ్వంసం చేసిన ‘ఖలిస్థానీలు’

ఖలిస్థాన్‌ ఉద్యమ సానుభూతిపరులు ఇటలీలో బుధవారం మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం నుంచి ఇక్కడ జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Published : 13 Jun 2024 04:14 IST

మోదీ పర్యటనకు ఒకరోజు ముందు ఘటన

రోమ్, దిల్లీ: ఖలిస్థాన్‌ ఉద్యమ సానుభూతిపరులు ఇటలీలో బుధవారం మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం నుంచి ఇక్కడ జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని గంటల్లోనే ఈ విధ్వంసం చోటుచేసుకొంది. నిందితులు విగ్రహం పీఠభాగంలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలు రాశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా శుభ్రం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలో గురువారం ప్రారంభమయ్యే 50వ జీ7 సదస్సు శనివారం దాకా కొనసాగనుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా మీడియాతో మాట్లాడుతూ.. ఇటలీ అధికారులతో ఈ విషయంపై చర్చించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతేడాది కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులోని వర్సిటీ ఆవరణలోనూ ఖలిస్థాన్‌ సానుభూతిపరులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

‘ఉక్రెయిన్‌’కు చర్చలు, దౌత్యపరమైన పరిష్కారమే ఉత్తమం : భారత్‌

భౌగోళిక రాజకీయ సంక్షోభాలపై దృష్టి సారించే జీ7 దేశాల సదస్సు గురువారం నుంచి ఇటలీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ సమస్యకు చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలే ఉత్తమమంటూ బుధవారం భారత్‌ తన వైఖరిని పునరుద్ఘాటించింది. సదస్సుకు ఉన్నతస్థాయి బృందంతో కలిసి మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా మాట్లాడుతూ.. 2022 సెప్టెంబరులోనే ఇది యుద్ధాల యుగం కాదని మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాథమ్యాలు, ప్రయోజనాలపై యుద్ధాలు చూపుతున్న ప్రభావం గురించి మాట్లాడటంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కృత్రిమమేధ, విద్యుత్తు, ఆఫ్రికా తదితర అంశాలపై శుక్రవారం జరిగే చర్చలో ఇతర దేశాధినేతలతో కలిసి ప్రధాని పాల్గొంటారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని