Kidnap: చివరకు తోటలో శవాలై తేలారు.. భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌ విషాదాంతం

కాలిఫోర్నియాలో సోమవారం అపహరణకు గురైన నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఎనిమిది నెలల పాప కూడా ఉంది. 

Updated : 06 Oct 2022 12:06 IST

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్‌నకు గురైన భారత సంతతి కుటుంబం ఘటన చివరకు విషాదాంతమైంది. అపహరణకు గురైన ఎనిమిది నెలల పాప, ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువు.. విగతజీవులై కనిపించినట్లు అక్కడి పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని మెర్సిడెస్‌ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్‌ సింగ్‌ కుటుంబం ట్రక్కుల రవాణ వ్యాపారం చేస్తోంది. సోమవారం ఉదయం జస్దీప్‌ సింగ్‌ (36), ఆయన భార్య జస్లీన్‌ కౌర్‌ (27), తమ ఎనిమిది నెలల పాపతో కలిసి యథావిధిగా వ్యాపార కార్యాలయానికి వెళ్లారు. వీరితోపాటు చిన్నారి మామ అమన్‌దీప్‌ సింగ్‌ (39)కూడా కాసేపటికి అక్కడికి చేరుకున్నారు. కాసేపటికే అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని దుండగుడు వారిని తుపాకితో బెదిరించి ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేశాడు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఒకరి కారు అదేరోజు సాయంత్రం వ్యాపార కార్యాలయ సమీపంలో దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్‌ ఆధారంగా యజమాని ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. కుటుంబ సభ్యులు తమకేమీ తెలియదని చెప్పారు. వారి ఆఫీసుకి వెళ్లి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో కిడ్నాప్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు. అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ అనుమానితుడి ఫొటోను మెర్సిడెస్‌ కౌంటీ పోలీసులు విడుదల చేశారు. అప్పటి నుంచి తీవ్రంగా గాలింపు చేపట్టి.. అదే రోజు అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఇంతలోనే పోలీసులు కిడ్నాప్‌ అయిన నలుగురి శవాల్ని బుధవారం సాయంత్రం ఓ తోటలో గుర్తించారు. అయితే, తమ అదుపులో ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు