Kim Jong Un: కిమ్‌ భార్య.. థియేటర్లో ప్రత్యక్షం..!

కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే.

Updated : 03 Feb 2022 07:30 IST

ఐదు నెలల తర్వాత అజ్ఞాతం వీడిన రి సోల్‌ జు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే. ఆయనే కాదు కీలక బాధ్యతలు చూసుకునే ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే. ఇటీవల కిమ్‌ భార్య రి సోల్‌ జు గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. తాజాగా ఆమె ఓ థియేటర్లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాదాపు ఐదు నెలల తర్వాత కిమ్‌ దంపతులు బహిరంగంగా కనిపించడంతో అక్కడి ప్రేక్షకులందరూ కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.

ఉత్తర కొరియా ప్రస్తుతం కొత్త సంవత్సర వేడుకలు (Lunar New Year) జరుపుకుంటోంది. ఇందులో భాగంగా కిమ్‌ జోంగ్‌ ఉన్-రి సోల్‌ జు దంపతులు ఓ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ వేదికపైకి వెళ్లి ప్రదర్శనకారులతో కలిసి ఫొటో దిగారు. ఆ సమయంలో ఆడిటోరియంలో ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, గతేడాది సెప్టెంబర్‌ 9న చివరిసారిగా ఆమె ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్‌తో కలిసి కనిపించిన తర్వాత మరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ ఆమె ప్రత్యక్షం కావడంతో అక్కడివారందరూ ఆశ్చర్యంగా చూసినట్లు సమాచారం.

ఇదిలాఉంటే, అంతకుముందు కూడా కిమ్‌ భార్య రి సోల్‌ జు దాదాపు ఓ ఏడాదిపాటు అజ్ఞాతంలో ఉండిపోయారు. దాంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరో బిడ్డకు జన్మనివ్వనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి కొవిడ్‌ కారణంగా ఆమె బాహ్య ప్రపంచం ఎదుటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చాయి. వారి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. అనంతరం తన మామ దివంగత కిమ్‌జోంగ్‌ ఇల్‌ జయంతి వేడుకల్లో భర్త కిమ్‌తో కలిసి కనిపించారు. తాజాగా మరోసారి సుదీర్ఘ కాలం తర్వాత బహిరంగ కార్యక్రమంలో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఇక కిమ్‌కు ఎంతమంది పిల్లలు ఉన్నారనే విషయంపై బహిరంగ సమాచారం లేనప్పటికీ ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెబుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని