North Korea: కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సాగుబాట.. భూమిని బాంబులతో పేల్చి శంకుస్థాపన

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సాగు బాటపట్టారు. దేశ ప్రజల ఆహారపు ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తూ......

Published : 21 Feb 2022 01:40 IST

ప్యాంగాంగ్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సాగు బాటపట్టారు. దేశ ప్రజల ఆహారపు ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తూ.. కూరగాయల కొరతను అధిగమించేందుకు నడుం బిగించారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్‌ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. భారీగా వచ్చిన సైనికుల నడుమ.. మంచుతో పేరుకుపోయిన మట్టిని బాంబులతో పేల్చి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.

శీతాకాలంతో తాజా కూరగాయలు లభించక ఉత్తర కొరియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చలికాలంలో తాజా కూరగాయలు దొరక్కపోవడంతో వాటికి బదులు పచ్చళ్లు, ఎండిన కూరగాయాలపై ఆధారపడతారు. అయితే శీతాకాలంలో వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి వాతావరణంలోనైనా ఏడాదంతా పంటలు పండించేందుకు కిమ్‌ సంకల్పించారు. కొన్నేళ్ల నుంచి దీనికి ప్రణాళికలు రచిస్తున్న ఆయన.. అంతర్జాతీయ, స్థానిక సంస్థల సహకారంతో గ్రీన్‌హౌస్ ఫామ్‌హౌస్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ఇక్కడ ఏడాది పొడవునా కూరగాయలు పండించే అవకాశం ఉంటుంది.

ప్రధాన నిర్మాణ ప్రాజెక్టుల కోసం మాత్రమే ఉపయోగించే సైన్యాన్ని ఈ వ్యవసాయ క్షేత్ర పనికి ఉపయోగిస్తున్నారు కిమ్. ఫామ్‌హౌజ్‌కు భూమిపూజ చేసి వెనుదిరిగిన కిమ్‌ను.. సైనికులు అభిమానంతో చుట్టుముట్టారు. వేల సంఖ్యలో సైనికులు చుట్టుముట్టడంతో ఆయన వాహనం ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని