Kim Jong-un: దేశంలో ఆహార సంక్షోభం.. కిమ్‌ కుమార్తె మాత్రం లగ్జరీ లైఫ్‌..!

ఉత్తరకొరియాలో (North Korea) ఆహార సంక్షోభం నెలకొందని ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సమయంలో కిమ్‌ (Kim Jong-un) కుమార్తె మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని దక్షిణ కొరియా నిఘా విభాగం వెల్లడించింది. 

Published : 10 Mar 2023 01:33 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియాలో (North Korea) ఆహార సంక్షోభం నెలకొన్నట్లు దక్షిణ కొరియాతోపాటు ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ప్రజలు సరైన ఆహారం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు అనుమానం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ కిమ్‌ సామ్రాజ్యంలోని పరిస్థితులపై ఎవరికీ స్పష్టత లేదు. ఇటువంటి సమయంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong-un) కుమార్తె మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా కొన్ని నెలలుగా కిమ్‌ మాత్రం తన శక్తిమంతమైన ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శించడంలో మాత్రమే నిమగ్నమయ్యాడని తెలిపింది.

కిమ్‌ తన కుమార్తె జుయె(Ju-ae)ని ఇటీవలే బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. సుమారు పదేళ్ల వయసున్న ఆ బాలికకు ఇంట్లోనే విద్యను అందిస్తున్నారని.. ఎన్నడూ ఆ బాలిక పాఠశాలకు వెళ్లలేదని సమాచారం. ఖాళీ సమయంలో స్విమ్మింగ్‌, గుర్రపు స్వారీ వంటి వాటితో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా గుర్రపు స్వారీలో తన కుమార్తె ఎంతో నేర్పరి అంటూ ఇతర నేతలతో కిమ్‌ గొప్పగా చెప్పారని తెలిపింది. ఉత్తర కొరియన్లు సరైన ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కిమ్‌ కుమార్తె మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ ఎన్‌ఐఎస్‌ వెల్లడించింది.

కిమ్‌ పిల్లల విషయంలో బాహ్య ప్రపంచానికి స్పష్టమైన సమాచారం లేదు. దక్షిణ కొరియా మీడియా సంస్థల ప్రకారం, ఆయనకు ముగ్గురు సంతానమని.. వారి వయసు 13, 10, 6ఏళ్లు ఉన్నట్లు పేర్కొన్నాయి. తొలిసారిగా నవంబర్‌ 2022లో ఒక అమ్మాయిని మాత్రం ఉత్తర కొరియా అధికారిక మీడియాలో చూపించారు. క్షిపణి ప్రయోగ సమయంలో కిమ్‌తో కలిసి తిరిగారు. మరోవైపు కిమ్ కుటుంబానికి దేశవ్యాప్తంగా పదిహేను విలాస సౌధాలు ఉన్నాయట. సొరంగమార్గాల్లోనే వాటి మధ్య ప్రయాణిస్తారని సమాచారం. అందుకోసం భూగర్భంలో రైల్వే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. తమ కుటుంబం శత్రుదేశాల దృష్టిలో పడకుండా ఉండేందుకే కిమ్ ఇలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తారని చెబుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని