Kim Jong Un: అణుదాడికి సిద్ధంగా ఉండండి..: కిమ్‌ జోంగ్‌ ఉన్‌

అమెరికా-దక్షిణ కొరియాలను కవ్వించేలా ఉ.కొరియా అధినేత మరో ప్రకటన చేశారు. అణుప్రతిదాడికి దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 

Published : 20 Mar 2023 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ క్షణమైనా అణు ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సైనిక దళాలను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ రంగ వార్తాసంస్థ కేసీఎన్‌ఏ సోమవారం ధ్రువీకరించింది. ఉ.కొరియా సరిహద్దుల్లో అమెరికా-దక్షిణ కొరియా వ్యూహాత్మక దళాలు సంయుక్తంగా సైనిక విస్తరణ చేయడాన్ని తప్పుపట్టారు. ఇరు దేశాలు సంయుక్తంగా ఉ.కొరియా అణుదాడులను తిప్పికొట్టేలా సైనిక విన్యాసాలు నిర్వహించాక కిమ్‌ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

మరోవైపు డమ్మీ అణువార్‌ హెడ్‌తో ఉత్తర కొరియా ఆదివారం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. ఇది సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 800 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని తాకింది. అణుదాడి ఎలా చేయాలనే అంశాన్ని పరీక్షించే క్రమంలో ఈ ప్రయోగం చేశారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో అయినా కచ్చితంగా దాడి చేసేలా దళాల సంసిద్ధతకు ఇది ఉపయోగపడనుందని ఉత్తరకొరియా చెబుతోంది. అమెరికా దళాలు ఫ్రీడమ్‌ షీల్డ్‌ పేరిట చేపట్టిన సంయుక్త సైనిక విన్యాసాల్లో స్ట్రాటజిక్‌ బాంబర్లను  వినియోగించడంతో  ఉత్తరకొరియా అణుప్రతిదాడులపై దృష్టి సారించింది. ఇటీవల కాలంలో అమెరికా-దక్షిణ కొరియాలు నిర్వహించిన అతిపెద్ద సైనిక విన్యాసాలు ఇవే. వీటిల్లో బీ-1బీ, ఎఫ్‌-35ఏ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. తాజాగా జరిగిన క్షిపణి పరీక్షకు కిమ్‌ తన కుమార్తె కిమ్‌ జుఏతో కలిసి హాజరయ్యారు. ఈ చిత్రాలు ఉత్తరకొరియా మీడియాలో పబ్లిష్‌ అయ్యాయి. ప్రస్తుతం కిమ్‌ కుమార్తె వయసు 9 సంవత్సరాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని