Kim: అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. సైన్యానికి కిమ్ ఆదేశాలు

యుద్ధం మాట చెప్పి కిమ్(Kim) మరోసారి వార్తల్లోకి వచ్చారు. తీవ్రస్థాయిలో డ్రిల్స్ నిర్వహించాలని,  ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించారు. 

Updated : 10 Mar 2023 20:54 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) నుంచి వచ్చే ప్రతిమాటా వార్త అవుతుంది. అలాగే ఆయన మాటలు, చేతలపై దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఇక ఇటీవల కిమ్ రాజ్యంలో యుద్ధం పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తాజాగా ఆయన తన సైన్యాన్ని ఆదేశించారు. తన కుమార్తెతో కలిసి సైనిక పరమైన డ్రిల్స్ పర్యవేక్షించిన సమయంలో ఈ వ్యాఖ్య చేశారు. అలాగే  హాసాంగ్ యూనిట్‌ నుంచి ఒకేసారి ఆరు క్షిపణులను ప్రయోగించినట్లు ఉ.కొరియా మీడియా సంస్థ విడుదల చేసిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. వారిద్దరూ కలిసి క్షిపణి ప్రయోగాలను వీక్షించారు. 

సైనిక డ్రిల్స్‌ను పర్యవేక్షిస్తోన్న సమయంలో కిమ్(Kim Jong Un) మాట్లాడుతూ.. ‘యద్ధానికి సిద్ధంగా ఉండాలి. అసలైన యుద్ధం కోసం వివిధ పద్ధతుల్లో డ్రిల్స్‌ను తీవ్రతరం చేయాలి’ అని వెల్లడించారు.

ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద సైనిక విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా, దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి ఇవి జరగనున్నాయి. ఈ క్రమంలో కిమ్ నోటి నుంచి యుద్ధం మాట వచ్చింది. ఉత్తర, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయి. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ, దక్షిణ కొరియాకు దీటుగా నిలిచేందుకు కిమ్ పోటీపడుతున్నారు. అగ్రరాజ్యం హెచ్చరికలు ఖాతరు చేయకుండా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ద.కొరియా సైనిక పరంగా అమెరికాపై ఆధారపడుతోంది. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. 

ఉత్తరకొరియా(North Korea) నియంత సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల అమెరికా(USA)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చిచెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది. ప్యాంగ్యాంగ్‌ వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని