Kim: అగ్రదేశానికి కిమ్ ‘అణు’ సవాల్‌..!

యూఎస్ నుంచి ఎదురయ్యే అణుముప్పును ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు.

Published : 29 Jul 2022 02:15 IST

ప్యాంగాంగ్‌: అగ్రదేశం అమెరికా, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్‌ అణు బెదిరింపులకు దిగారు. ఆ దేశాలతో ఎలాంటి సైనిక ఘర్షణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 2017 తర్వాత మొదటిసారి ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షకు దిగుతుందన్న అంచనాల మధ్య కిమ్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) వెల్లడించింది. కొరియా దేశాల మధ్య యుద్ధం ముగింపు 69వ వార్షికోత్సవం సందర్భంగా నియంత నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. 

‘మన బలగాలు ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాయి. అణుముప్పును ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఆత్మరక్షణ నిమిత్తం ఈ తక్షణ చారిత్రక కర్తవ్యాన్ని సాధించాల్సి ఉంది. యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు కావొస్తోన్న సమయంలో కూడా దక్షిణ కొరియాతో కలిసి యూఎస్‌.. ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలకు దిగుతోంది. మన దేశాన్ని ఒక బూచిలా చూపి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. మన భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతూ, మన సాధారణ సైనిక కార్యకాలపాలను రెచ్చగొట్టే చర్యలుగా తప్పుదోవపట్టిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి పూర్తిగా ఖండించదగినది. ఈ వైఖరి ఇరు దేశాల సంబంధాలను తిరిగి కోలుకోలేని దశకు దిగజార్చుతాయి. యూఎస్‌, దక్షిణ కొరియా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని మరోమారు స్పష్టం చేస్తున్నాను ’అంటూ కిమ్ వెల్లడించారు.

ఉత్తర కొరియా 2017 తర్వాత మొదటి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందంటూ ఇటీవల యూఎస్‌, దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ అణుపరీక్షకు అవకాశం ఉందని ఇంటర్‌ కొరియన్‌ అఫైర్స్‌(కొరియా దేశాల అంతర్గత వ్యవహారాలు)ను పర్యవేక్షిస్తోన్న దక్షిణ కొరియా నేత అంచనా వేశారు. మరోపక్క దక్షిణ కొరియా రక్షణ సిబ్బంది మాత్రం అలాంటి సంకేతాలేవీ లేవని చెప్పడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని