Kim Sister: దక్షిణ కొరియాపై ‘కిమ్‌’ సోదరి అవమానకర వ్యాఖ్యలు

అమెరికా, దక్షిణ కొరియాలు తోడు దొంగలుగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సోదరి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు, అక్కడ ప్రభుత్వంలోని వారిని మూర్ఖులుగా అభివర్ణించడంతోపాటు పరుష పదజాలంతో దూషించారు.

Published : 25 Nov 2022 01:35 IST

సియోల్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జొంగ్‌ ఉన్‌ రాజ్యంలో ఆయన సోదరి కిమ్‌ యో జొంగ్‌ శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె.. కిమ్‌ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా దక్షిణ కొరియాను తీవ్ర పదాలతో దూషించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితోపాటు అక్కడి ప్రభుత్వాన్ని ‘మూర్ఖులు’గా అభివర్ణించిన ఆమె.. అమెరికా చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కిమ్‌ సోదరి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

‘అమెరికా చెప్పినట్లు నడుచుకునే దక్షిణ కొరియా.. మాపై నిర్మొహమాటంగా ఆంక్షలు విధిస్తూనే ఉంది. ద.కొరియా కన్జర్వేటివ్‌ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌, ఆయన ప్రభుత్వంలోని వారంతా మూర్ఖులే. మాకు ప్రమాదకర పరిస్థితులను కల్పిస్తూనే ఉన్నారు’ అని కిమ్‌ సోదరి చెప్పినట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. ఇక మూన్‌ జే-ఇన్‌ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణ కొరియా తమ లక్ష్యం కాదన్న ఆమె.. అమెరికా, దక్షిణ కొరియాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తూ తమపై ఆంక్షలు కొనసాగిస్తున్నారని విమర్శించారు.

కిమ్‌ సోదరి వ్యాఖ్యలపై దక్షిణ కొరియా కూడా తీవ్రంగా స్పందించింది. తమ అధినేత, ప్రభుత్వంపై అవమానకరంగా మాట్లాడటం శోచనీయమని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు తమ ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురిచేయడంతోపాటు ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేకులను ప్రేరేపించే ప్రయత్నంలో భాగమేనని మండిపడింది. దేశంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఉత్తర కొరియాకు చెందిన 15 మంది వ్యక్తులతో పాటు 16 సంస్థలపై దక్షిణ కొరియా ఇటీవల ఆంక్షలు విధించింది.

అమెరికా, దక్షిణ కొరియాలపై ఉత్తర కొరియా పరుషపదజాలం వాడటం ఇదేం కొత్త కాదు. ఇటీవల ఉత్తర కొరియా జరిపిన క్షిపణి ప్రయోగాలను ఖండించాలంటూ ఐరాసపై అమెరికా ఒత్తిడి చేయడంపై తీవ్రంగా మండిపడింది. కుక్కతో పోలుస్తూ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ మ్యూంగ్‌-బా, మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గెయున్‌-హైలను కూడా గతంలో అసభ్య పదజాలంతో దూషించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని