King Charles III: రాజు పట్టాభిషేకం.. ఏర్పాట్ల కోసం రూ.1020కోట్లు..!

మే 6న జరగనున్న బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేక కార్యక్రమానికి సుమారు 100 మిలియన్‌ పౌండ్లు (రూ.1020 కోట్లు) ఖర్చుపెడుతున్నట్లు అంచనా.

Published : 25 Apr 2023 19:54 IST

లండన్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 (King Charles III) పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం (Coronation) ప్రపంచదేశాల అధినేతల మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం వెళ్లింది. మే 6న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్‌ పౌండ్లు (రూ.1020 కోట్లు) ఖర్చుపెడుతున్నట్లు అంచనా. ఈ అధికారిక కార్యక్రమానికి అయ్యే ఖర్చును బ్రిటన్‌ (Britain) ప్రభుత్వమే చెల్లించనుంది. సాధారణంగా రాజకుటుంబీకుల వివాహాలను సొంత ఖర్చుతో చేసుకున్నప్పటికీ.. పట్టాభిషేకాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్నారు.

బ్రిటన్‌ రాణిగా ఎలిజబెత్‌ II 1953లో పట్టాభిషిక్తురాలయ్యారు. ఆ కార్యక్రమానికి అప్పట్లోనే 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టారట. ప్రస్తుత కరెన్సీ విలువతో పోలిస్తే అది సుమారు 50 మిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.528.7 కోట్లు)తో సమానం. తాజా కార్యక్రమం.. క్వీన్‌ ఎలిజబెత్‌ పట్టాభిషేక కార్యక్రమానికి అయిన ఖర్చుకు రెట్టింపు అన్నమాట. అయితే, ఈ కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయం భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కార్యక్రమానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా వస్తుందని.. అంతేకాకుండా ఇది పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుందని బ్రిటన్‌ మీడియా పేర్కొంది. రాజు పట్టాభిషేక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు హాజరుకానుండటంతో వారికి భద్రత కల్పించడం అతిపెద్ద సవాల్‌ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ‘ఆపరేషన్‌ గోల్డెన్‌ ఆర్బ్‌’ వెల్లడించింది.

  • 1953 నాటి పట్టాభిషేక కార్యక్రమంతో పోలిస్తే ఊరేగింపు మార్గం తక్కువగా ఉంటుందట. అయినప్పటికీ అది పూర్తికావడానికి 40నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
  • అప్పట్లో రాణి ఎలిజబెత్‌ పట్టాభిషేక కార్యక్రమాన్ని సుమారు 3 లక్షల మంది నేరుగా తిలకించారట.
  • ఈ కార్యక్రమాన్ని బ్రిటన్‌లో 3.7కోట్ల మంది తిలకిస్తారని అంచనా. క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల సమయంలో వీక్షించిన దానిని బట్టి ఈ మేరకు అంచనా వేశారు.
  • పట్టాభిషేక కార్యక్రమాన్ని సాధారణంగా వారాంతంలో జరపరు. ఈ సంప్రదాయాన్ని కింగ్‌ ఛార్లెస్‌ పక్కకు పెట్టారు. అయితే, ఫుట్‌బాల్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇబ్బంది లేకుండా మే 6ను ఎంపిక చేశారట.
  • లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో జరిగే ఈ కార్యక్రమం కోసం 700ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని సిద్ధం చేస్తున్నారు.
  • రాజు ఛార్లెస్‌-3 భార్య కెమిల్లా మాజీ భర్త ఆండ్రూ పార్కర్‌ బొవెల్స్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానుండటం విశేషం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని