King Charles III: రాజు పట్టాభిషేకానికి.. డబ్బావాలాలనుంచి ఉపరాష్ట్రపతి వరకు..!
బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేక వేడుకకు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలతో పాటు ఎంతోమంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. భారత్ నుంచి ఉపరాష్ట్రపతితో పాటు ముంబయి డబ్బావాలాలకు ఆహ్వానం అందడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌లో (Britain).. రాజు పట్టాభిషేకానికి (King Charles III ) రంగం సిద్ధమైంది. ఈ వేడుకను లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించడంతోపాటు టీవీల్లో కోట్ల మంది చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జరగనున్న ఈ మహా ఆర్భాటానికి (Coronation) ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు, అతిథులకు ఆహ్వానం అందింది.
ఏడు దశాబ్దాల తర్వాత జరుగుతోన్న రాజు (King Charles III) పట్టాభిషేక కార్యక్రమానికి రాజకుటుంబంతోపాటు 2200 మందిని ఆహ్వానించినట్లు సమాచారం. ఇందులో సుమారు 200 దేశాలకు చెందిన ప్రముఖుల్లో 100 మంది దేశాధినేతలు, ఇతర దేశాల ప్రతినిధులు, మతపెద్దలు, నోబెల్ గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. భారత్‌లోని ముఖ్యులతో పాటు కొందరు సామాన్యులకూ బ్రిటన్ రాజకుటుంబం నుంచి పిలుపు వచ్చింది. దీంతో మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ IIIకి జరిగే పట్టాభిషేక మహోత్సవానికి భారత్ నుంచి ఎవరెవరు హాజరు కానున్నారనే విషయాన్ని పరిశీలిస్తే..
జగ్‌దీప్ ధన్‌ఖడ్: భారత్ నుంచి రాష్ట్రపతి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. బదులుగా ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు. రాణి ఎలిజబెత్ II కన్నుమూసిన సమయంలో భారత రాష్ట్రపతి బ్రిటన్‌కి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. రాణి ఎలిజబెత్ II పట్టాభిషేక కార్యక్రమానికి (1953లో) నాటి భారత ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ హాజరయ్యారు.
ప్రధాని రిషి సునాక్: పట్టాభిషేక కార్యక్రమంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు పాల్గొంటారు. బ్రిటన్ మంత్రులకు ఒక్కక్కరికి మాత్రమే ఆహ్వానం ఉండగా.. ప్రధాని రిషి సునాక్ మాత్రం ఆయన భార్యతో కలిసి పాల్గొననున్నట్లు సమాచారం.
సోనమ్ కపూర్: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పట్టాభిషేక కార్యక్రమంలో తళుక్కున మెరవనున్నారు. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, బేర్ గ్రిల్స్, టామ్ జోన్స్ వంటి నటులతో కలిసి సోనమ్ పాల్గొననున్నారు. ఆమె భర్త ఆనంద్ ఆహూజా బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.
ముంబయి డబ్బావాలాలు: రాజు చార్లెస్ III పట్టాభిషేకాన్ని తిలకించేందుకు ముంబయిలోని ఇద్దరు డబ్బావాలాలకూ (Mumbai Dabbawala) ఆహ్వానం అందింది. వీరికి భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. బ్రిటన్‌కు వెళ్తున్న ఈ డబ్బావాలాలు పుణెరీ పగిడీ (పుణెలో వినియోగించే తలపాగా)ని రాజుకు కానుకగా ఇవ్వనున్నారు. దీంతోపాటు వర్కారీ సంఘం తయారుచేసిన షాలువా కూడా బహుకరించనున్నారు. అయితే, 2003లో భారత్‌లో పర్యటించిన ప్రిన్స్ చార్లెస్.. ముంబయి డబ్బావాలాలను కలుసుకున్నారు. 2005లో చార్లెస్- కెమిల్లా వివాహానికి కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ ముంబయి డబ్బావాలాలకు ఆహ్వానం అందింది.
మంజూ మల్హీ: భారత సంతతికి చెందిన షెఫ్ మంజూ మల్హీకి ఆహ్వానం అందింది. బ్రిటన్‌లో జన్మించిన మల్హీ.. యూకేలోని ఓ వయోవృద్ధుల స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆమె చేసిన సేవలకుగానూ బ్రిటిష్ రాజకుటుంబ మెడల్ (BEM)ను అందుకున్నారు. రాజు పట్టాభిషేక కార్యక్రమానికి ఈ అవార్డును అందుకున్న 850 మందికి ఆహ్వానం అందింది.
సౌరభ్ ఫడ్కే: పుణెలో జన్మించిన ఆర్కిటెక్ట్, ఉపాధ్యాయుడు సౌరభ్ ఫడ్కే రాజకుటుంబానికి చెందిన ఛారిటీలో పనిచేస్తున్నారు. రాజు వేడుకలో ఆయన కూడా పాల్గొననున్నారు. వీరితోపాటు భారత సంతతి వ్యక్తి గల్ఫ్‌షా, ఇండో కెనడియన్ జై పటేల్‌లు కూడా పట్టాభిషేక కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!