Kuwait fire Accident: కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!

కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Published : 16 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదం (Kuwait Fire Accident)లో 50 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో 46 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న ఏడంతస్తుల భవనంలో 196 మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు సమాచారం. వారిలో చాలావరకు భారతీయులే. అయితే.. ఖర్చులను తగ్గించుకునేందుకు చట్టాలను అతిక్రమించి పెద్దసంఖ్యలో విదేశీ కార్మికులను అసురక్షిత పరిస్థితుల్లో ఉంచుతున్నారంటూ స్థిరాస్తి వర్గాలు, కంపెనీల యజమానులపై స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మంగాఫ్‌ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపినట్లు స్థానిక వార్తాసంస్థ తెలిపింది.

‘‘ప్రమాద సమయంలో భవనంలో 179 మంది ఉన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని కాపలాదారు గదిలో విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటలు మొత్తం వ్యాపించాయి. అనేకమంది కిందకు దిగి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. దట్టమైన పొగతో ఊపిరాడక మెట్లపైనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తలుపునకు తాళం వేసి ఉండటంతో భవనంపైకి కూడా వెళ్లలేకపోయారు’’ అని ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. నివాస భవంతుల్లో అనధికారిక నిర్మాణాల సమస్య కువైట్‌లో దీర్ఘకాలంగా ఉంది. అదనపు ఆదాయం కోసం బేస్‌మెంట్ పార్కింగ్ ప్రదేశంలో గిడ్డంగులు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ స్థలంలో ఇళ్లు, దుకాణాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనతో ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది.

తొలిసారి బయటకు కేట్‌ మిడిల్టన్‌.. క్యాన్సర్‌ చికిత్సపై భావోద్వేగ పోస్టు..!

అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారమే భారత్‌కు చేరుకున్నాయి. 23 మంది కేరళవాసులు ఉండగా.. 16 మంది అంత్యక్రియలు పూర్తయ్యాయి. దుర్మరణం పాలైన భారత కార్మికుల కుటుంబాలకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కువైట్‌కు చెందిన ఎన్‌బీటీసీ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామంది. బాధితులంతా ఈ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్‌బీటీసీ సంస్థలో భాగస్వామిగా, ఎండీగా వ్యవహరిస్తున్న కేరళకు చెందిన కేజీ అబ్రహం శనివారం మాట్లాడుతూ.. ఈ ఘటనను దురదృష్టకరంగా పేర్కొన్నారు. జరిగిన దానికి క్షమాపణలు చెబుతూ.. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు