Kuwait Fire: కువైట్‌ విషాదం.. మూడంతస్తుల పైనుంచి దూకి.. ప్రాణాలు రక్షించుకొని!

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య 45కు చేరింది. 

Updated : 13 Jun 2024 19:45 IST

దుబాయ్‌: కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య 45కు చేరింది. మరో ముగ్గురిని ఫిలిప్పీన్స్‌కు చెందినవారుగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సిఉందని కువైట్‌ ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రకటించారు. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారని, వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు వాయుసేన విమానం అక్కడ సిద్ధంగా ఉందని దిల్లీలో అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషాద ఘటనలో ప్రాణాలు రక్షించుకునేందుకు బాధితులు చేసిన ప్రయత్నాలు, వారి కుటుంబ నేపథ్యాలు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి.

నీటి ట్యాంకులో దూకి..

ఏడంతస్తుల భవనంలో మంటలు వ్యాపించిన విషయం తెలుసుకొన్న అనేకమంది.. కిందకు దిగి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో దట్టమైన పొగతో ఊపిరాడక మెట్లపైనే ఒరిగిపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మూడో అంతస్తులో ఉన్న కేరళకు చెందిన ఓ యువకుడు మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలని భావించాడు. మరో ఆలోచన చేయకుండా ధైర్యంతో సమీపంలోని వాటర్‌ ట్యాంక్‌లో దూకేశాడు. దీంతో అతడి పక్కటెముకలు విరిగిపోవడంతోపాటు తీవ్ర రక్తస్రావం అయ్యింది. అయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

టాటూతో గుర్తించి..

మృతదేహాలను మార్చురీలో ఉంచిన అధికారులు వాటిని గుర్తించేందుకు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న శ్రీహరి అనే యువకుడి తండ్రి.. కుమారుడి మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. ‘ముఖం పూర్తిగా వాచిపోయి ఉండటం, మసితో నల్లగా మారడంతో నా కుమారుడిని గుర్తించడం కష్టంగా మారింది. చివరకు శరీరంపై ఉన్న టాటూ ఆధారంగా గుర్తుపట్టా’ అని తండ్రి ప్రదీప్‌ వాపోయాడు. వీరిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తుండగా.. శ్రీహరి మాత్రం వారం క్రితమే కువైట్‌కు వచ్చినట్లు తెలిసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని