Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి

కువైట్‌లో ఓ భవనంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో 40 మంది భారతీయులే కావడం విచారకరం.

Updated : 12 Jun 2024 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరబ్‌ దేశం కువైట్‌ (Kuwait)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో మంటలు చెలరేగి 50 మంది మృతిచెందారు. వీరిలో 40 మంది భారతీయులే (Indians) కావడం మరింత విషాదకరం. జీవనోపాధి కోసం సొంతవాళ్లకు దూరంగా వచ్చి ఓ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా ఇలా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది కేరళ వాసులేనని తెలుస్తోంది.

దక్షిణ మంగాఫ్‌ నగరంలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం (Fire Accident) జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో భవనంలో 160 మంది ఉన్నారు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తొలుత కిచన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో 44 మంది మంటల్లో కాలి సజీవదహనమవ్వగా.. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 40 మంది భారతీయులేనని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది భారతీయులే. ఘటన జరిగిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

విదేశాంగ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 50 మందికి పైగా మరణించారని, మరో 50 మందికి పైగా బాధితులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్‌ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని