Ukrain: ఖెర్సాన్‌ను ముంచుతున్న ముప్పు..!

కఖోవ్కా డ్యామ్‌ నుంచి లీకవుతున్న నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇప్పటికే వేలమందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు. రష్యా ఆధీనంలోని ప్రాంతాల్లో ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. 

Updated : 07 Jun 2023 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌లోని నోవా కఖోవ్కా డ్యాం దిగువ ప్రాంతాలు మెల్లగా జలమయం అవుతున్నాయి. దీంతో నీపర్‌ నది పరీవాహక ప్రాంతంలోని 42,000 మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాటికి వరద తీవ్రస్థాయిలో రావచ్చని అంచనావేసింది. వచ్చే 20 గంటల్లో ఖెర్సాన్‌లో మూడు అడుగుల మేరకు నీరు చేరవచ్చని భావిస్తున్నారు. మరోవైపు వరద నీరు మైఖోలోవ్‌లోని వంతెనలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. యెల్జావెటికోవ్‌ అనే గ్రామంలోని వంతెన కూలిపోయింది. హల్‌హన్విక గ్రామంలోని వంతెన కొట్టుకుపోయింది.

మరోవైపు ఈ డ్యామ్‌ దెబ్బతిని వరద రావడంతో దాదాపు ఏడుగురు ఆచూకీ గల్లంతైనట్లు రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని 900 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత స్థానాలకు తరలించారు. ఈ ఘటనపై రష్యా విదేశాంగశాఖ స్పందించింది. ఇది తీవ్రమైన మానవీయ, ప్రకృతి విపత్తుకు కారణమవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌ దళాలు ఈ డ్యామ్‌పై భారీగా శతఘ్ని దాడి చేశాయని ఆరోపించింది.

అసలేమిటీ కఖోవ్కా డ్యామ్‌..?

ఉక్రెయిన్‌లోని అతిపెద్దదైన కఖోవ్కా డ్యామ్‌ 30 మీటర్ల ఎత్తు.. 3.2 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణం సోవియట్‌ నేత స్టాలిన్‌ సమయంలో మొదలై.. నికితా కృశ్ఛేవ్‌  సమయంలో పూర్తయింది. ఉక్రెయిన్‌కు మంచినీరు అందించే నీపర్‌ నదిపై దీనిని నిర్మించారు. 

ఈ డ్యామ్‌కు 2,155 చదరపు కిలోమీటర్ల రిజర్వాయర్‌ ఉంది. దీని నిర్మాణం కోసం 37,000 మందికి పునరావాసం కల్పించారు. ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్‌ కిలోమీటర్ల నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్‌ నుంచి క్రిమియా ద్వీపకల్పానికి, జపొరోజియా అణువిద్యుత్తు కేంద్రానికి నీటి సరఫరా జరుగుతుంది. ఇక రిజర్వాయర్‌ ఎగువ భాగంలో దాదాపు 100 మైళ్ల పరిధిలోని ప్రదేశాలకు నీరు అందిస్తోంది. వీటిలో రష్యాలోని ప్రదేశాలు కూడా ఉన్నాయి. 

ఇక అణువిద్యుత్తు కేంద్రానికి సంబంధించి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని ఐఏఈఏ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ప్లాంట్‌ వద్ద పరిస్థితిని ఆ సంస్థ నిశితంగా గమనిస్తోంది. ఒక వేళ డ్యామ్‌లో అత్యల్పస్థాయి అయిన 12.7 మీటర్లకు నీరు చేరినా.. అణువిద్యుత్తు కేంద్రంలోని కూలింగ్‌ వ్యవస్థకు అవసరమైన నీటిని సరఫరా చేసే ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్లాంట్‌కు కూలింగ్‌ పాండ్‌ కూడా ఉన్నట్లు వెల్లడించింది.  

క్రిమియాకు మరోసారి నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకొన్న తర్వాత కఖోవ్కా డ్యామ్‌ కాల్వ నుంచి నీటిసరఫరాను ఉక్రెయిన్‌ నిలిపివేసింది. గతేడాది రష్యా సేనలు ఉక్రెయిన్‌ను ఆక్రమించుకొన్న తర్వాత క్రిమియాకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ ఇప్పుడు డ్యామ్‌ దెబ్బతినడంతో మరోసారి ఆ ప్రాంతానికి నీటి ఎద్దడి తప్పేట్లు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని