Sri Lanka Crisis: శ్రీలంకలో ఆగ్రహ జ్వాలలు.. ప్రధాని నివాసం ముట్టడి..!

శ్రీలంక ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ముట్టడించిన వేల మంది నిరసనకారులు.. ప్రధాని వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 25 Apr 2022 02:29 IST

16వ రోజుకు చేరిన ఆందోళనలు

కొలంబో: తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రీలంక వాసులు అధ్యక్షుడు, ప్రధాని పదవులను వీడాలని ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ముట్టడించిన వేల మంది నిరసనకారులు.. ప్రధాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (IUSF)కు చెందిన వేల మంది విద్యార్థులు ప్రధానమంత్రి మహింద రాజపక్స అధికారిక నివాసాన్ని ఆదివారం ముట్టడించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారిని ఎదుర్కొని ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాని తమ పదవులకు రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ అధికార నివాసంలోకి చొచ్చుకొనిపోయే ప్రయత్నం చేశారు. మహింద ఇంటి గోడపైకి ఎక్కి భారీ స్థాయిలో నిరసన తెలిపారు. అయితే, ఆ సమయంలో ప్రధాని మహింద ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన రెండు వారాలుగా కొలంబో రోడ్లపై ఆందోళన కొనసాగిస్తున్న వేల మంది నిరసనకారులు.. ప్రభుత్వ కార్యాలయాలనూ చుట్టుముడుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స కార్యాలయం ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో ఓ నిరసనకారుడు ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అయినప్పటికీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని అధ్యక్షుడు గొటబయ, ప్రధాని మహింద రాజపక్స స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని