Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభం.. ఖాళీ కానున్న డీజిల్‌ బంకులు..!

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక, రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 08 Apr 2022 15:44 IST

భారత్‌ సహాయాన్ని భారీగా వినియోగించుకుంటున్న పొరుగుదేశం

కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక.. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులను చవిచూచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి వున్నాయనే వార్తలు శ్రీలంక వాసులను వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కిచేందుకు 500 మిలియన్‌ డాలర్ల విలువైన చమురును లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌గా భారత్‌ అందిస్తోంది. దీన్ని శ్రీలంక వేగంగా వినియోగించుకుంటోంది. మరికొన్ని రోజుల్లోనే ఇవి కూడా తరిగిపోనున్నాయి. ఒకవేళ భారత్‌ నుంచి ఈ సహాయం కొనసాగింపు పొందకపోతే ఏప్రిల్‌ నెలాఖరు నాటికి శ్రీలంకలో డీజిల్‌ బంకులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో భారత్‌ ఇంధన సహాయాన్ని అందిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఇంధనం సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ.. అక్కడి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మార్చి చివరివారం నుంచే వాటి సరఫరా మొదలుపెట్టింది. ఏప్రిల్‌ 15, 18, 23 తేదీల్లో మరిన్ని దఫాల్లో శ్రీలంకకు ఇంధనం సరఫరా చేయనుంది. అయితే భారత్‌ చేస్తోన్న ఈ సాయం ఏప్రిల్‌ చివరి నాటికి కూడా సరిపోక పోవచ్చన్ని అంచనా. ఆ తర్వాత కష్టాలు గట్టెక్కాలంటే మరోసారి శ్రీలంక భారత్‌ సహాయం తీసుకోవాల్సిందే.

దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతోపాటు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీలంకకు భారీ స్థాయిలో డీజిల్‌ అవసరం. అయితే, ఇంధన కొరత ఏర్పడడంతో ఇప్పటికే కొన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేశారు. దీంతో నిత్యం పది గంటలపాటు విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. ఇక దేశంలో ఉన్న ఒకేఒక రిఫైనరీ కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు. దిగుమతులకు చెల్లింపులు చేయలేక గత నవంబరులో రెండుసార్లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పొరుగుదేశం శ్రీలంక.. భారత్ సహాయంపై ఆధారపడాల్సి వచ్చింది.

గార్మెంట్‌ రంగం కుదేలు..

అమెరికాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్లకు శ్రీలంక భారీ స్థాయిలో వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. దేశ జీడీపీలో వీటి వాటా 6శాతం ఉందంటే అవి ఎంత కీలకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, విద్యుత్‌ కొరత వల్ల గార్మెంట్‌ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటున్నట్లు పరిశ్రమ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంటలపాటు కరెంటు కోతలతో చిన్నతరహా పరిశ్రమలు మూత పడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధ్యక్షుడితో చర్చేందుకూ సిద్ధమయ్యాయి.

వేధిస్తోన్న ఔషధాల కొరత..

మరోవైపు దేశంలో నెలకొన్న సంక్షోభం వైద్యరంగంపైనా పడింది. ముఖ్యంగా అత్యవసర ఔషధాల కొరత శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాధారణ సర్జరీలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఔషధాలు, వైద్య పరికరాలతోపాటు రియేజెంట్ల కొరత ఏర్పడుతోందని శ్రీలంక మెడికల్‌ అసోసియేషన్‌ (SLMA) అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఇలా నిత్యం గంటలపాటు విద్యుత్‌ కోతలు, గ్యాస్‌, ఆహారంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల కొరత శ్రీలంక వాసులను వేధిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీస్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. అయితే, ఈ నిరసనలు రాజకీయ ప్రేరేపితంగా పేర్కొంటోన్న ప్రభుత్వం.. అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకకు సహాయాన్ని ప్రకటించిన భారత్‌.. ఇంధన కొనుగోలు కోసం 500మిలియన్‌ డాలర్ల రుణపరిమితిని అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని