డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కారు దొరికితే ఉక్రెయిన్‌కు పార్శిల్‌!

లాత్వియా (Latvia) దేశ అధికారులు మాత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన వారికి విన్నూత్న రీతిలో శిక్ష విధిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్‌ చేసి ఉక్రెయిన్‌ (Ukraine) సైన్యానికి అందజేస్తున్నారు.

Published : 09 Mar 2023 21:16 IST

రిగా: తాగి వాహనం నడుపుతూ (Drink and Drive) పట్టుబడితే.. కేసు నమోదు చేసి,  వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిని మరుసటి రోజు కౌన్సిలింగ్‌ రమ్మని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దిరికితే వాహనం సీజ్‌ చేయడం, జరిమానా లేదా కొద్దిరోజుల జైలు శిక్ష విధిస్తారు. కానీ, ఉత్తర ఐరోపాలో బాల్టిక్‌ (Baltic) సముద్ర తీరంలో ఉన్న లాత్వియా (Latvia) దేశ అధికారులు మాత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన వారికి వినూత్న రీతిలో శిక్ష విధిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే.. వారి వాహనాన్ని సీజ్‌ చేస్తున్నారు. అలా సీజ్‌ చేసిన వాహనాలను ఉక్రెయిన్‌ (Ukraine) సైన్యానికి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,200 పైగా కార్లను అందచేసినట్లు వెల్లడించారు. 

రక్తంలో ఆల్కహాల్‌ స్థాయిలు 0.15 శాతం కన్నా ఎక్కువ ఉండి రెండు నెలల వ్యవధిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వాహనం నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను లాత్వియా పోలీసులు సీజ్‌ చేస్తారు. ఇలా పట్టుబడిన వాహనాలను జైడాట్‌ ఎల్‌వీ(Ziedot.lv) అనే ఎన్‌జీవో ద్వారా ఉక్రెయిన్‌ తరలిస్తున్నారు. వాటిని ఉక్రెయిన్‌ సైన్యం తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటుంది. ఈ ఎన్‌జీవో ఉక్రెయిన్‌ను సాయం అందించేందుకు ట్విటర్‌ కాన్వాయ్‌ (Twitter Convoy) పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

‘‘మా ఎన్‌జీవో ద్వారా ఉక్రెయిన్‌కు తరలిస్తున్న వాహనాలను చూస్తే దేశంలో ఇంత మంది తాగి వాహనాలను నడుపుతున్నారా? అని భయంగా ఉంది. ప్రజలు మద్యం తాగినంత సులువుగా సీజ్‌ చేసిన వాహనాలను విక్రయించలేరు. అందుకే, ఆ వాహనాలను ఉక్రెయిన్‌ అందజేయాలనే ప్రతిపాదనన ప్రభుత్వం ముందుకు తెచ్చాను. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో ఇప్పటి వరకు 1,200 పైగా కార్లను ఉక్రెయిన్‌ను తరలించాం’’ అని ట్విటర్‌ కాన్వాయ్‌ వ్యవస్థాపకుడు రినిస్‌ పోజ్నాక్స్‌ తెలిపారు. 

లాత్వియా ప్రభుత్వ సమాచారం ప్రకారం గతేడాది సుమారు 4,300 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే.. వారిలో ఎక్కువ మంది ప్రమాదాలు చేశారట. గతంలో ఇలా సీజ్‌ చేసిన వాహనాలను వేలంలో విక్రయించేవారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ సాయంగా ఈ వాహనాలను ఉచితంగా ఆ దేశానికి అందజేస్తున్నట్లు లాత్వియా ఆర్థిక మంత్రి అర్విల్స్‌ అసెరాడెన్స్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని