DTEK: ‘దేశాన్ని వీడండి..!’ విద్యుత్‌ ఆదాకు ఉక్రెనియన్లకు సూచన

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేటు విద్యుత్‌ సంస్థ ‘డీటీఈకే’ అధిపతి మాగ్జిమ్‌ టిమ్‌షెంకో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ను తగ్గించేందుకుగానూ.. ఉక్రెనియన్లు దేశాన్ని విడిచిపెట్టి, కొంత కాలం ఇతర ప్రాంతాల్లో నివసించే అవకాశాన్ని పరిశీలించాలని ఓ వార్తాసంస్థతో అన్నారు.

Published : 20 Nov 2022 01:43 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ ఇంధన వ్యవస్థలే లక్ష్యంగా రష్యా కొంత కాలంగా తన దాడులను ముమ్మరం విషయం తెలిసిందే. దీంతో.. దేశవ్యాప్తంగా లక్షలాది పౌరులు విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్నారు. శీతాకాలం సమీపిస్తుండటంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేటు విద్యుత్‌ సంస్థ ‘డీటీఈకే(DTEK)’ అధిపతి మాగ్జిమ్‌ టిమ్‌షెంకో(Maxim Timchenko) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ను తగ్గించేందుకుగానూ.. ఉక్రెనియన్లు దేశాన్ని విడిచిపెట్టి, కొంత కాలం ఇతర ప్రాంతాల్లో నివసించే అవకాశాన్ని పరిశీలించాలని ఓ వార్తాసంస్థతో అన్నారు. మూడు, నాలుగు నెలలపాటు బయట ఉంటే.. పవర్‌ నెట్‌వర్క్‌పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు.

‘మాస్కో దాడులతో దేశ ఇంధన వ్యవస్థలు ఇప్పటికే దాదాపు సగం దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుత అవసరాలకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి కావడం లేదు. మరోవైపు.. మరమ్మతులకు విడిభాగాల కొరత ఏర్పడింది. మున్ముందు పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడమే దీనికి కీలక పరిష్కారం. కాబట్టి, దేశాన్ని విడిచిపెట్టడంతో సహా.. ఈ దిశగా అన్ని అవకాశాలను పరిశీలించాలి. స్థానికంగా పొదుపు చర్యలు చేపడితే.. గాయపడిన సైనికులు ఉన్న ఆసుపత్రులకు నిరంతరాయ కరెంట్‌కు భరోసా ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలే.. యుద్ధంలో విజయం సాధించేందుకు ఉక్రెయిన్‌కు సహాయపడతాయి’ అని టిమ్‌షెంకో వివరించారు. ఇదిలా ఉండగా.. ‘డీటీఈకే’ సంస్థ ఉక్రెయిన్‌ వ్యాప్తంగా నాలుగింట ఒకవంతు కంటే ఎక్కువ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని