Liz Truss: ప్రధానిగా 45 రోజులే అయినా.. జీవితాంతం.. ఏడాదికి రూ.కోటి భత్యం

ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్‌ ట్రస్‌.. బ్రిటన్‌లో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. అయినప్పటికీ తదనంతరం ప్రభుత్వం నుంచి ప్రతిఏటా సుమారు రూ.కోటి భత్యాన్ని పొందేందుకు అర్హత సాధించారు. వివాదాస్పద నేతగా రాజీనామా చేసిన ఆమెకు ఈ భత్యాన్ని ఇవ్వవద్దనే వాదన బ్రిటన్‌లో మొదలయ్యింది.

Updated : 21 Oct 2022 19:21 IST

లండన్‌: సంపన్నులకు పన్ను రాయితీలను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడం.. ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పదవిలో ఉన్నది కేవలం 45 రోజులే అయినప్పటికీ తదననంతరం ఏడాదికి సుమారు రూ.1.05 కోట్లు (1,15,000 పౌండ్లు)  ప్రభుత్వం నుంచి జీవితాంతం భత్యంగా అందుకోనున్నారు.

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామాతో నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్‌ట్రస్‌ ఏడు వారాలు కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయారు. దీంతో బ్రిటన్‌కు అతితక్కువ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా యూకే చరిత్రలో నిలువనున్నారు. పనిచేసింది తక్కువ సమయమే అయినా పబ్లిక్‌ డ్యూటీ కాస్ట్‌ అలవెన్స్‌ (PDCA) పొందేందుకు అర్హత పొందారు. దీంతో లిజ్‌ ట్రస్‌ జీవితాంతం ఈ భత్యాన్ని అందుకోనున్నారు. మాజీ ప్రధానమంత్రులకు జీవితాంతం సహాయం అందించేందుకు 1991లో పీడీసీఏను ప్రవేశపెట్టారు. పదవిలో లేకున్నా ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనే ఉద్దేశంతో ఈ భత్యాన్ని అందిస్తారు. మాజీ ప్రధానిగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది వేతనాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన బిల్లులకు మాత్రమే ఈ భత్యం చెల్లిస్తారు.

అయితే, ప్రస్తుతం ఐదుగురు బ్రిటన్‌ మాజీ ప్రధానులు ఈ భత్యాన్ని పొందేందుకు అర్హత సాధించగా.. ఆ జాబితాలో లిజ్‌ ట్రస్‌ చేరనున్నారు. అందులో మాజీ ప్రధాని జాన్‌ మేజర్‌, టోని బ్లెయిర్‌లు అత్యధిక భత్యాన్ని పొందుతున్నట్లు సమాచారం. గోర్డాన్‌ బ్రౌన్‌ (1,14,712 పౌండ్లు), డేవిడ్‌ కామెరోన్‌ (1,13,423 పౌండ్లు), థెరిసా మే (57,832 పౌండ్లు)లు భత్యాన్ని అందుకుంటున్నారు. అయితే, బోరిస్‌ జాన్సన్‌ ఈ భత్యాన్ని తీసుకుంటున్నారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ లిజ్‌ ట్రస్‌ ఈ పథకం కింద లబ్ధిపొందితే.. ఆరుగురు మాజీ ప్రధాన మంత్రులకు ఏడాదికి 8లక్షల పౌండ్లు (రూ.7.37 కోట్లు) అవుతున్నట్లు అంచనా.  వివాదాస్పద నిర్ణయాలతో పదవిని వీడుతోన్న లిజ్‌ ట్రస్‌కు ఈ భత్యాన్ని అందించవద్దని.. లేదా ఆమె స్వయంగా వదులుకోవాలనే వాదన మొదలయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని