Elon Musk: ట్విటర్‌లో కొత్త ఫీచర్లు.. వారంలోనే అందుబాటులోకి..!

ట్విటర్‌లో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు.

Updated : 08 Jan 2023 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్ ట్విటర్‌ (Twitter)ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయనే విషయంపై యూజర్లలో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌లో కీలక మార్పులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. వచ్చే వారంలోపే ఇవి మొదలవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు, ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌలభ్యం ట్విటర్‌లో కల్పించనున్నట్లు వెల్లడించారు.

‘రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు ఈవారం చివరలోనే అందుబాటులోకి వస్తాయి. ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌ వారం తర్వాత విడుదల అవుతుంది. దీర్ఘ రూపంలో ఉండే ట్వీట్ల సౌలభ్యం మాత్రం ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుంది’ అని ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఇలా ట్విటర్‌లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నట్లు మస్క్‌ ప్రకటించడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘరూపంలో ఉండే ట్వీట్లను చేసే సౌలభ్యం కోసం ఇంకా ఎంతోకాలం వేచిచూడలేమని స్పందిస్తున్నారు.

మరోవైపు ట్విటర్‌ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం మంది ఉద్యోగులపై వేటు వేసిన ఎలాన్‌ మస్క్‌.. తాజాగా డబ్లిన్‌, సింగపూర్‌ కేంద్ర కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లోనూ చాలా మందిని తీసేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని