Ukraine Crisis: బైడెన్‌తో ఏకీభవించని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌..!

రష్యా చర్యలను బైడెన్‌ నరమేధంతో పోల్చడంపై పశ్చిమ దేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తంకావడంలేదు. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలను నరమేధంతో పోల్చేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

Published : 13 Apr 2022 22:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా చర్యలను బైడెన్‌ నరమేధంతో పోల్చడంపై పశ్చిమ దేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలను నరమేధంతో పోల్చేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మేక్రాన్‌ నిరాకరించారు. ప్రభుత్వ రంగానికి చెందిన వార్తసంస్థ ఫ్రాన్స్‌2 ఇంటర్వ్యూలో మేక్రాన్‌ ఈ విధంగా స్పందించారు. రష్యా చర్యలను మీరు కూడా బైడెన్‌లా నరమేధంతో పోలుస్తారా..? అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి మేక్రాన్‌ స్పందిస్తూ.. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పదాలు వాడే ముందు జాగ్రత్తగా ఉంటాను. వీరిద్దరు (రష్యా, ఉక్రెయిన్‌వాసులు) సోదరులు. యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పేందుకు నా ప్రయత్నాలను వీలైనంత కొనసాగిస్తాను. మన వాక్‌చాతుర్యాన్ని పెంచడం వల్ల శాంతి లభిస్తుందని నేను అనుకోను. ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇవి యుద్ధనేరాలు’’ అని పేర్కొన్నారు. యుద్ధనేరాలపై దర్యాప్తులో ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్‌ సాయం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్నారు. 

ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో జోబైడెన్‌ నేడు తీవ్రంగా స్పందించారు. ‘‘నేను దానిని నరమేధమే అంటాను. ఎందుకంటే అసలు ఉక్రెయిన్‌ ఉన్నదన్న ఆలోచనను కూడా కూకటివేళ్లతో సహా పెకలించేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. నా దృష్టిలో ఇది ఓ నరమేధమే’’ అంటూ ఆయన మండిపడ్డారు. తొలిసారి ఆయన నరమేధం అనే పదం వాడటం సంచలనం సృష్టించింది. గతంలో బైడెన్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దళాల చర్యలను యుద్ధ నేరాలుగానే పేర్కొన్నారు. కానీ, తాజాగా ‘నరమేధం’ పదం వాడటం విశేషం. ఉక్రెయిన్‌ సంక్షోభంపై  అమెరికా దృష్టికోణంలో నాటకీయమైన మార్పులు వస్తోన్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని