Macron: అమెరికా మిత్రపక్షమంటే..బానిసని కాదు: మేక్రాన్‌ వ్యాఖ్యలు

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్(Emmanuel Macron) స్పందించారు. అమెరికాతో ఉన్న సంబంధాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

Published : 13 Apr 2023 14:20 IST

పారిస్‌: తైవాన్‌(Taiwan) విషయంలో చైనా-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా తన మాటలను మేక్రాన్‌ సమర్థించుకున్నారు. తాము అమెరికాకు మిత్ర పక్షంగా ఉన్నామంటే బానిసలమని అర్థం కాదన్నారు. 

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Macron) ఇటీవల చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తైవాన్‌ విషయంలో చైనా-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ.. అందులో యూరప్‌ దేశాలు చిక్కుకోకూడదన్నారు. అంతేకాకుండా అమెరికా విదేశాంగ విధానంతోనూ యూరోపియన్లు తమను తాము బంధించుకోకూడదంటూ మేక్రాన్‌ చేసిన హెచ్చరికలు పాశ్చాత్య దేశాలను కలవరపెట్టాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అధ్యక్షుడు స్పందించారు. ‘అమెరికా(America)కు మిత్ర దేశంగా ఉండటమంటే.. బానిసలుగా ఉండటమని కాదు. మా గురించి మేం ఆలోచించుకునే హక్కు లేదని అర్థం కూడా కాదు. తైవాన్‌ యథాతథ స్థితి కొనసాగింపు విషయంలో ఫ్రాన్స్‌, ఐరోపా విధానం మారలేదు’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా(America) మాత్రం ఫ్రాన్స్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ..మేక్రాన్‌(Emmanuel Macron) చైనా(China) పర్యటనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘మేక్రాన్‌.. నాకు మంచి మిత్రుడు. తన ప్రయోజనాల కోసం చైనాతో కలిసి వెళ్తున్నాడు. ఫ్రాన్స్‌ ఇప్పుడు చైనాతో కలిసిపోతోంది’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని