Published : 18 Mar 2022 21:42 IST

UK: ఉద్యోగులకు షాకిచ్చిన అతిపెద్ద సంస్థ.. ఒకే రోజు 800మంది తొలగింపు

లండన్‌: ఓ నౌకాయాన సంస్థ సిబ్బందికి షాకిచ్చింది. ఒకే రోజు భారీ సంఖ్యలో సిబ్బందిని తొలగించింది. బ్రిటన్​లోనే అతిపెద్ద నౌకాయాన సంస్థ అయిన ‘పీ అండ్​ ఓ ఫెర్రీస్​’ 800మంది సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తీసేసింది. తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని తెలిపింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను తప్పించడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పలువురు నౌకల్లోనే ఉండి బయటకు రాలేదు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు జూమ్ సందేశం ద్వారా చెప్పారని సిబ్బంది వెల్లడించారు. యూకే, ఫ్రాన్స్​, బ్రిటన్​, ఐర్లాండ్​, నెదర్లాండ్స్​ మధ్య నిర్వహిస్తున్న కార్యకలాపాలు ఇకపై థర్డ్ పార్టీ చూసుకుంటుందని సంస్థ పేర్కొన్నట్లు ఆ సిబ్బంది తెలిపారు.

సంస్థ తీరును బ్రిటన్‌ ప్రభుత్వం తప్పుబట్టింది. ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం సరికాదని ప్రధాని బోరిస్ జాన్సన్​ అధికారి ప్రతినిధి మ్యాక్స్ బ్లెయిన్ పేర్కొన్నారు. సంస్థ కోసం చాలా ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న పీ అండ్​ ఓ సిబ్బందికి సంఘీభావం తెలిపారు. యాజమాన్యం చర్య మోసపూరితంగా ఉందని, కరోనా సమయంలో ప్రభుత్వం నుంచి పీ అండ్​ ఓ ఫెర్రీస్‌కు రూ.వందల కోట్లు నిధులు అందాయని ఓడల సిబ్బంది సమాఖ్య వెల్లడించింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది.

పీ అండ్ ఓ కొన్నాళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉంది. ఏటా 100 మిలియన్​ పౌండ్ల వరకు నష్టపోతున్నామని, మాతృసంస్థ అయిన డీపీ వరల్డ్​ వాటిని పూడ్చుతోందని సంస్థ పేర్కొంది. కార్యకలాపాలు కొనసాగించాలంటే సిబ్బందిని తగ్గించుకోవడం తప్ప మరోమార్గం లేదని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు కొత్త సిబ్బందిని నియమించుకోవాలని సంస్థ భావిస్తోంది.

అయితే తొలగించిన సిబ్బందికి పరిహారంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా అందిస్తామని పీఅండ్ ఓ చెప్పింది. కరోనా సమయంలో నౌకాయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. రవాణా సేవలు నిలిపివేయడం వల్ల సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో 1,100మంది ఉద్యోగులను తొలగిస్తామని 2020లోనే ఆ సంస్థ ప్రకటించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని