Published : 10 May 2022 02:27 IST

Malala: ప్రజా జీవితం నుంచి వారిని తుడిచిపెట్టేస్తున్నారు.. మలాలా ఆందోళన

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మహిళలందరూ తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని తాలిబన్‌ పాలకులు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల విషయమై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ సోమవారం తాలిబన్‌ పాలనపై మండిపడ్డారు. అఫ్గాన్‌లో బాలికలు, మహిళలను ప్రజా జీవితం నుంచి తుడిచిపెట్టేయాలని వారు భావిస్తున్నట్లు ఆరోపించారు. ‘బాలికలను పాఠశాలలకు, మహిళలను ఉద్యోగాలకు దూరం చేయడం.. కుటుంబానికి చెందిన మగ తోడు లేకుండా ప్రయాణాలకు నిరాకరించడం.. ముఖం, శరీరాన్ని కప్పి ఉంచమని బలవంతం చేయడం వంటి చర్యల ద్వారా బాలికలు, మహిళలను ప్రజాజీవితం నుంచి దూరం చేయాలని తాలిబన్లు భావిస్తున్నార’ని ట్వీట్‌ చేశారు.

‘తాలిబన్లు వారి వాగ్దానాలను ఉల్లంఘిస్తూనే ఉన్నందున.. స్థానిక మహిళల పట్ల మోగుతున్న ప్రమాద ఘంటికలను నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికీ.. మహిళలు తమ హక్కులు, గౌరవం కోసం పోరాడటానికి వీధుల్లోకి వస్తున్నారు. మనమందరం, ముఖ్యంగా ముస్లిం దేశాలకు చెందినవారు వారికి అండగా నిలబడాలి’ అని పిలుపునిచ్చారు. లక్షలాది మహిళలు, బాలికల హక్కుల ఉల్లంఘన విషయంలో తాలిబన్లను బాధ్యులను చేయడానికి సమష్టి చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. తాలిబన్లు తిరిగి క్రమంగా తమ కటువైన పాలన దిశగా వెళ్తున్నట్లు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా మహిళలపై విధించిన ఆంక్షలు.. 1996-2001ల నాటి వారి అసలు రూపాన్ని బయటపెడుతున్నాయి.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts